ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి కూటమి ఘన విజయం సాధించడంతో, నేడు ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, ఇంకా 10 మంది వరకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.నేడు ఎన్డీయే శాసన సభా పక్ష నేతను ఎన్నుకునే సమావేశం ఏవన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ సమావేశానికి టిడిపి జనసేన బిజెపి నేతలు హాజరయ్యారు . ఇక కూటమి శాసనసభ్యులంతా ఈ సమావేశానికి హాజరై చంద్రబాబు నాయకత్వాన్ని సమర్ధించారు. చంద్రబాబు నాయుడు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించగా బీజేపీతో పాటు ప్రతి ఒక్కరు ఆయనను ఏకగ్రీవంగా ఆమోదించారు.అయితే ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన చంద్రబాబు వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని తీసి వేయించి అందరితో సమానంగా తనకుర్చీని మార్పించుకున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అన్నది అందరికీ అర్థమయ్యేలాగా చంద్రబాబు చేసిన పని ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.కూటమిని మూకుమ్మడిగా ఒకే తాటిపై ముందుకు నడిపించాల్సిన నాయకుడు చంద్రబాబు చివరికి కుర్చీ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుని అందరితో సమానంగా మార్పించుకున్నారు అన్న చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం వచ్చినప్పటికీ తనతో కలిసి వచ్చిన పార్టీలకు ప్రముఖ స్థానం ఇచ్చేందుకే చంద్రబాబు ఈ చర్యకు పాల్పడ్డారని కూడా చర్చిస్తున్నారు.