లబ్ధిదారుల వాటా సొమ్ము పై దృష్టి పెట్టండి
సమీక్షలో కమిషనర్ నాగ నరసింహరావు ఆదేశం
కొమరగిరి లేఔట్ లో గృహ నిర్మాణాలు వేగవంతం చేసే దిశగా ప్రత్యేకాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కొమరగిరి లేఔట్ లో గృహ నిర్మాణ ప్రగతి పై ఆయన హౌసింగ్, నగరపాలక సంస్థ, మెప్మా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా లబ్ధిదారులు తమ వాటా సొమ్మును త్వరగా సమకూర్చుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. బేస్మెంట్ పూర్తి చేసుకుని రూఫ్ లెవెల్, స్లాబ్ నిర్మాణానికి సిద్ధమవుతున్న లబ్ధిదారులకు లేబర్, మెటీరియల్ కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. గృహ నిర్మాణ లక్ష్యాలకు సంబంధించి రోజువారి ప్రగతిని సమీక్షిస్తామన్నారు. వివిధ దశల్లో ఉన్న సుమారు 7 వేల ఇళ్లను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆయన ప్రత్యేక అధికారులకు సూచించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ ఈఈ శ్రీనివాసరావు, డిఈ సత్యనారాయణ రెడ్డి, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం. ఏసుబాబు, మేనేజర్ కర్రి సత్యనారాయణ, టిపిఆర్ఓ మానే కృష్ణమోహన్, ప్రత్యేక అధికారులు, సీవో లు పాల్గొన్నారు.