కంపు కొడుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం
హిందూపురంటౌన్
హిందూపురం పట్టణ పరిధిలోని కొట్నూరు చెరువులో చేపలు మృతి చెందాయి. ఈ చేపలు కాలుష్యంతో మృతి చెందినాయా లేక మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందినాయా అన్నది అర్థం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. మొత్తానికి చెరువులో ఉన్న చేపలన్ని మృతి చెంది కంపు కొడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.
హిందూపురం పురపాలక సంఘంలోని కొట్నూరు చెరువులో ఆ వార్డ్ కౌన్సిలర్ అండదండలతో తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి అనధికారికంగా చేపలను పడుతున్నాడు. ఈ విషయంలో స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఆ సమయంలో సకాలంలో స్పందించి బహిరంగ వేలం వేయాల్సిన మత్స్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు తాము బహిరంగ వేలం నిర్వహించమని, మున్సిపల్ శాఖ పరిధిలో ఉండడంతో మున్సిపల్ కమిషనర్ బహిరంగ వేలం వేస్తారని పేర్కొన్నారు. ఆయన వెంటనే మత్స్య శాఖ అధికారులను పిలిపించి నిబంధనల మేరకు బహిరంగ వేలం నిర్వహించాలని సూచించారు. దీంతో మత్స్యశాఖ అధికారులు ఎన్నికలు ముగిసిన వెంటనే బహిరంగ వేలం నిర్వహిస్తామని కమిషనర్ తో అన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం చెరువులో ఉన్న చేపలన్ని మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెరువులోని కాలుష్యం వల్ల చేపలు మృతి చెంది ఉంటే గతంలోని మృతి చెందాలని, అలా కాకుండా మరికొన్ని రోజుల్లో కొట్నూరు చేపల చెరువును బహిరంగ వేలం వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక్కసారిగా చేపలు మృతి చెందాయని, దీని వెనుక ఎవరో విష ప్రయోగం చేసి ఉంటారన్న అనుమానాలను కొట్నూరు ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని మత్స్య శాఖ ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తే సమగ్ర వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కొట్నూరు చెరువులో ఒక్కసారిగా చేపలు మృతి చెందడంతో పట్టణంతో పాటు హిందూపురం- పెనుకొండ పోవు రహదారి మొత్తం కంపు కొడుతోంది. వెంటనే దీనిపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.