ప్రజాభూమి, బుట్టాయగూడెం.
శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.. స్తోత్ర పఠనంతో, జైశ్రీరామ్.. నినాదాలతో భద్రాచలం శ్రీరాముని సన్నిధికి భక్తుల పాదయాత్ర ప్రారంభించారు. మండలంలోని కండ్రికగూడెం శ్రీ సాయినాధుని ఆలయం నుండి సుమారు 300 మంది భక్తులు భద్రాచలం పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా కండ్రికగూడెం పరిసర ప్రాంత ప్రజలు కార్తీక మాసంలో ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదుకులను శిరస్సును ధరించి, కాషాయ పతాక ధారణతో భక్తులు పాదయాత్ర చేపట్టడం విశేషం. శ్రీ షిరిడి సాయి దేవాలయ పూజారి దెయ్యాల సీతారామాంజనేయులు మార్గదర్శకత్వంలో ఈ పాదయాత్ర ప్రతి ఏడాది చేపడుతున్నట్లు చెప్పారు. దారి పొడవునా భక్తులు పాదయాత్ర చేస్తున్న వారికి అల్పాహారం, భోజన,వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం జీలుగుమిల్లిలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షుడు పసుపులేటి రాము మధ్యాహ్నం భోజనం అందించారు. గురుస్వామి రామాంజనేయులు , తెలగారాపు బాలు పాదయాత్ర భక్తులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ పవిత్ర కార్యానికి చేసిన సహాయం ఎంతో గొప్పదని, పవన్ కళ్యాణ్ సీఎం, చిర్రి బాలరాజు ఎమ్మెల్యే అయ్యేవరకు తలనీలాలు తీయనని, షేవ్ చేసుకోనని శ్రీరామ ప్రభువుకు మొక్కుకున్నానని కొమ్ముగూడెం చెందిన తెలగారపు బాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోము హరినారాయణ, రూపా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.