పోరుమామిళ్ల :
పోరుమామిళ్ల గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో జరిగిన వివిధ రకాల పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు గురువారం విశ్రాంత డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ.డాక్టర్ మార్కారెడ్డి, జెవివి నాయకులు దాదా పీర్, గఫార్ ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గత 22 రోజులుగా పోరుమామిళ్ల గ్రంథాలయంలో లైబ్రేరియన్ ఆఫ్రిది ఆధ్వర్యంలో జన విజ్ఞానవేదిక సహకారంతో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో ప్రతిరోజు 50 మంది విద్యార్థులు పాల్గొంటూ దినపత్రికలు, కథల పుస్తకాలు, మహానుభావుల జీవిత చరిత్రలు చదువుకుంటున్నారు. క్యారమ్స్, చెస్ తదితర ఆటలు ఆడుతూ ఉన్నారు. గత వారం రోజులుగా విద్యార్థులకు పద్యాలు, కథలు, నృత్యం,చిత్రలేఖనం తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో పాటు హాజరైన 50 మంది విద్యార్థులకు గురువారం బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా లైబ్రేరియన్ ఆఫ్రిది మాట్లాడుతూ ఈనెల7వ తేదీ శుక్రవారంతో సమ్మర్ క్యాంపు ముగుస్తుందన్నారు. విద్యార్థులు వేసవి సెలవుల అనంతరం పాఠశాలల లో సైతం చక్కగా చదువుకుని అభివృద్ధి బాటలో పయనించాలన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తాము ప్రతి ఆదివారం గ్రంధాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకుంటామని ఆనందోత్సాహాలతో తెలిపారు.
