- ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- కచ్చితత్వంతో త్వరితగతిన ఫలితాల వెల్లడికి ప్రత్యేక ఏర్పాట్లు
- సాయంత్రం అయిదారు గంటలకల్లా ప్రక్రియను పూర్తిచేసేలా ప్రణాళిక
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
అధికారుల సమన్వయం, మీడియా సహకారంతో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసినట్లే చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాలకు.. నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈవీఎం కౌంటింగ్ (పార్లమెంటరీ నియోజకవర్గం)కు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 చొప్పున మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కౌంటింగ్‌కు టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 17,596 పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఇప్పటివరకు 153 ఈటీపీబీఎస్ ఓట్లు వచ్చినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా 14 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి లెక్కింపును రెండు రౌండ్లలో పూర్తిచేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని.. ఒక్కో రౌండ్‌కు దాదాపు 3 గంటల సమయం పడుతుందన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు కచ్చితమైన ప్రణాళికతో స్క్రుటినీ నిర్వహించి, ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కచ్చితమైన ప్రణాళికతో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఫారం-21సీ డిక్లరేషన్ వంటి వాటితో సహా సాయంత్రం 5 లేదా 6 గంటలకు పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
పార్కింగ్‌తో పాటు పటిష్ట భద్రతా ఏర్పాట్లు:
కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బందిని ఉదయం ఆరు గంటలకల్లా చేర్చేందుకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంతో పాటు కేతనకొండ, కొండపల్లి, ఇబ్రహీంపట్నం సర్కిల్ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కింగ్‌కు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నోవా, నిమ్రా కళాశాలలతో పాటు జాతీయ రహదారి పాయింట్ వద్ద పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఎంట్రీ పాయింట్ ఉంటుందన్నారు. వీరి మొబైళ్ల ఫోన్లకు మీడియా సెంటర్ వరకు అనుమతి ఉంటుందన్నారు. కౌంటింగ్ స్టాఫ్, కౌంటింగ్ ఏజెంట్లు తదితరుల మొబైళ్లకు అనుమతి లేనందున వారి ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తాగునీరు, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హైస్పీడ్ ఇంటర్నెట్, టీవీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితరాలతో నిమ్రా, నోవా కళాశాలల్లో మీడియా సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపును వేగంతో కచ్చితత్వంతో నిర్వహించి.. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సూచిక బోర్డుల ఏర్పాట్లు, గుర్తింపు కార్డుల జారీ, అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అత్యంత నాణ్యమైన శిక్షణ ఇచ్చాం:
కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రెండో రౌండ్ శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది అనుసంధానానికి ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్
కట్టుదిట్టమైన భద్రత ఉంటుందన్నారు. స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌తో పాటు సీసీటీవీల నిఘా ఉంటుందని తెలిపారు. ఈవీఎంల్లో నమోదైన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏవైనా సమస్యలు వస్తే తక్షణం సరిదిద్దేందుకు బెల్ ఇంజనీర్స్ అందుబాటులో ఉంటారన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు 17సీ-పార్ట్ 1, వైట్ పేపర్స్ తెచ్చుకుంటే సరిపోతుందని.. క్యాలిక్యులేటర్, ప్యాడ్, పెన్స్ వంటివాటిని అధికారులే సమకూర్చనున్నట్లు తెలిపారు. ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లతో పూర్తి సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
ప్రత్యేక సమన్వయ సమావేశాలతో మంచి ఫలితాలు: జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్
జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్, పీసీ ఈవీఎం కౌంటింగ్ ఉదయం 8 గంటలకు, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కౌంటింగ్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియపై ఇప్పటికే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ట్రాఫిక్, భద్రత తదితరాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు, నోడల్ అధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ వెల్లడించారు.