కేంద్రం ఎమర్జెన్సీ విధించాలి రాజస్థాన్ హైకోర్టు సూచన…
దేశవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఈసారి ముఖ్యంగా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్ని వడగాల్పులు మంట పుట్టిస్తున్నాయి. దీంతో జనం ప్రాణాలు అరచేత్తో పట్టుకుని ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే వరకూ వడగాల్పుల కారణంగా దేశంలో 54 మంది చనిపోయినట్లు కేంద్రం తెలిపింది.ఢిల్లీ, పంజాబ్, ఒడిశాలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని భారత వాతావరణ విభాగం చెబుతోంది. ఒక్క ఒడిశాలోని సుందర్ గఢ్ లోనే గత 24 గంటల్లో వడగాల్పులకు 12 మంది చనిపోయినట్లు ఐయాన్స్ వార్తా సంస్థ తెలిపింది. జార్ఖండ్ లోని పాలమూ జిల్లాలో ఓ మహిళ సహా నలుగురు చనిపోయినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట స్ధాయిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. బీహార్ లోనూ వడగాల్పుల కారణంగా 8 మంది చనిపోయారు.రాజస్థాన్ లో వడగాల్పుల తీవ్రత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి సూచించింది. వడగాల్పుల నుంచి ప్రజల్ని కాపాడటానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచించింది. మరో రెండు రోజుల్లో వడగాల్పుల తీవ్రత తగ్గవచ్చని భావిస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నాయి.
తీవ్ర వేసవి తాపంతో దేశవాసులు అల్లాడుతున్న నేపథ్యంలో వేడిగాలులు, చలి గాలులను జాతీయ విపత్తులుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ హైకోర్ట్ అభిప్రాయపడింది. వడదెబ్బ తగిలి చనిపోయిన ఓ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ఈ అంశాన్ని కోర్టు పరిశీలించింది.పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులకు సంబంధించిన ఈ అంశాన్ని రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా పరిశీలించింది. రాజస్థాన్ వాతావరణ మార్పుల ప్రాజెక్ట్ కింద రూపొందించిన ‘హీట్ యాక్షన్ ప్లాన్’ను సమర్థమంతంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు తక్షణమే తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖలు కమిటీలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలంటూ రాజస్థాన్ చీఫ్ సెక్రటరీకి హైకోర్ట్ స్పష్టం చేసింది. వడదెబ్బ కారణంగా మృత్యువాత పడిన వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా ఉత్తర భారత రాష్ట్రాల్లో వేడి గాలులు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్ట్ ఈ విధంగా స్పందించింది.
రోడ్లపై చల్లటి నీటిని చల్లాలి
వేసవి తాపానికి తగ్గట్టుగా పలు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర అధికారులకు రాజస్థాన్ హైకోర్టు కీలక సూచనలు చేసింది. జనసందోహం ఎక్కువగా ఉండే రోడ్లపై నీటిని చల్లాలని సూచించింది. అవసరమైన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద శీతలీకరణ స్థలాలు, షెడ్స్ ఏర్పాటు చేయాలని జస్టిస్ అనూప్ కుమార్ దండ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.