ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. కాగా, తాజాగా బాధ్యతలు చేపట్టిన ఏబీవీ కొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ‘ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేను. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు.