వేలేరుపాడు :పోలవరం ముంపు మండలాలలో ఒకటైన వేలేరుపాడు మండలంలో అధికారుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయన్న విమర్శలు బహాటంగా వినిపిస్తున్నాయి, పోలవరం ప్రాజెక్టు పుణ్యమా అని, ప్రతి ఏటా గృహాలు, గృహ ఉపకరణ సామాగ్రి, పంటలను నష్టపోతు ఆర్థికంగా ఎన్నో విధాలుగా కృంగిపోతున్న నిర్వాసిత ప్రజలను ,వేధించుకు తింట్టున్న అధికారుల తీరు (గోరుచుట్టుపై రోకలి పోటు) చందంగా మారింది. పాలక ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసే, ముంపు మండలాల ప్రజలు త్యాగదనులని వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత తమదేనని భాకాలు కొట్టడం పరిపాటిగా మారింది తప్ప, ఏ ఒక్క నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం జరగలేదన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికే ఈ విధంగా రకరకాల ఆశలు కల్పించి మోసం చేయడం పాలకులకు పరిపాటిగా మారింది, వరదల సమయంలో సైతం వరద గోదావరి ముంచుకొస్తుంటే ఎవరిమానాన వారు నిర్వాసిత ప్రజలు వారి వారి సామాగ్రిని దాతలు ఏర్పాటుచేసిన వాహనాల్లోను , మరి కొంతమంది కిరాయి చెల్లించి మరి తమ సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు, ఈ విషయంలో సైతం సంబంధిత అధికార యంత్రాంగం (వరిగడ్డి బండి కింద కుక్క) చందంగా తామే అద్దె వాహనాలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించినట్లు బిల్లులు చేసుకుని, ప్రజాధనాన్ని దోచుకోవటం నిత్య కృత్యంగా మారింది, ఈ విషయంపై పలువురు ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారుల నుంచి ఏ విధమైన స్పందన లేదంటే! వారికి సైతం ఈ దోపిడీతో సంబంధం ఉందన్నది తేటతెల్లమవుతున్నది, ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం అధికారులు మరో కొత్త మార్గాన్ని, నిర్వాసిత ప్రజల నుంచి డబ్బులు రాబట్టుకునేందుకు ఎన్నుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అది ఎలా అంటే వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురయ్యే గ్రామాల్లోని నిర్వాసితు ప్రజలను ,సురక్షిత ప్రాంతాలలో గృహ వసతి కల్పించి తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది, కానీ ప్రాజెక్టు మీద గల శ్రద్ధ నిర్వాసిత ప్రజలపై చూపటం లేదన్నది జగమెరిగిన సత్యం ,దీనితో ఆ సమయంలో బ్రతుకు జీవుడా అని ప్రాణాలు అరిచేత పెట్టుకొని అష్టకష్టాలు పడి ఆర్థికంగా నష్టపోతూ, ఎవరికి వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి వరదల అన్ని రోజులు తలదాచుకోవటం జరుగుతుంది ,ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ కష్టాలు పడలేమని ఎవరికి వారు ,సురక్షిత ప్రాంతాలైన పలు గ్రామాలలో స్థలాలను ఏర్పాటు చేసుకొని గృహాలను నిర్మించుకున్నారు, ఆ సమయంలో సైతం ఇదే అధికార యంత్రాంగం ప్రతి ఒక్కరి వద్ద ఎంతోకొంత వసూలు చేసుకుని, తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా పంచుకున్నారు, ప్రస్తుతం ఇదే అధికారులు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ పేరుతో ,నూతనంగా గృహాలు నిర్మించుకోవడం చట్టపరంగా నేరమని, బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఆ సమయంలో ఇదే అధికారులు ఏ విధమైన ఆంక్షలు లేకుండా గృహాలు నిర్మించుకునేందుకు సహకరించారని, ప్రస్తుతం గృహాలు నిర్మించుకోవడం నేరమని చట్ట ప్రకారంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేయడం ఎంతవరకు సబవని ప్రశ్నిస్తున్నారు.

రాను రాను నిర్వాసిత ప్రజలను రాబందుల్లా పీక్కు తినే పరిస్థితి నెలకొందని మండల ప్రజలు దీనావేదనలు వ్యక్తం చేస్తున్నారు, ఇదంతా ఎందుకు తమకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు, నష్టపరిహారాలు త్వరితగతిన అందిస్తే తామే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతాము కదా అంటున్నారు, ఇదిగో పరిహారం, అవిగో ప్యాకేజీలు అని ప్రకటించిన అధికారులు, ఈ ప్రాంతాలు వీడి పునరావాసాలకు వెళ్లిన వారికి సైతం నేటి వరకు పరిహారాలు అందించలేదని వాపోవటం నిర్వాసితులవంతయింది, ఈ విధంగా నిర్వాసిత ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కనీసం స్పందించని అధికారి యంత్రాంగం, చట్టాల పేరుతో వేధించేందుకై తక్షణం స్పందించడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు లేకపోలేదు, (అమ్మ పెట్టా పెట్టదు అడుక్కొని తినానివ్వదు )అన్నా చందంగా ప్రభుత్వపరంగా కల్పించాల్సిన పునరావాసాలు కల్పించకపోగా! తామంతట తాముగా ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చుకుని సురక్షిత ప్రాంతాల్లో, బ్రతుకు జీవుడా అని గృహాలు నిర్మించుకుంటే వాటిపై కేసులని బెదిరించటం సమంజసమా? ఇప్పటికైనా ఈ వేధింపులపై రాజకీయాలకతీతంగా నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు పోలవరం నిర్వాసిత ప్రజలకు అండగా నిలబడి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.
