Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలురోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మృతి..భర్త సురక్షితం..హత్యగా అనుమానాలు

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మృతి..భర్త సురక్షితం..హత్యగా అనుమానాలు

ఖమ్మం జిల్లాలో అనుమానాస్పద ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకుంటున్న గొడవల నేపద్యంలో భర్త చేసిన పకడ్బందీ హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆడ పిల్లలు పుట్టారనే సాకుతో కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల జోక్యంతో కలిసి ఉంటున్న క్రమంలో మంగళవారం రాత్రి భార్యా పిల్లలతో కలిసి కారులో ఊరికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో కారు రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది.ఈ సంఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందగా, అతడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో చోటు చేసుకొంది. అల్లుడే తన కుమార్తెను, మనవరాళ్లను చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలంలో విగతజీవులుగా పడి ఉన్న తల్లి, ఇద్దరు పిల్లలను చూసి పలువురు కంటతడి పెట్టారు.
అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు సీపీఆర్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఏన్కూరు మండలం రామ్ నగర్ తండాకు చెందిన ధరంసోత్ హరిసింగ్ చిన్న కుమార్తె కుమారిని రఘునాథపాలెం మండలం బావోజీతండాకు చెందిన బోడా ప్రవీణ్ కు ఇచ్చి 2017లో వివాహం చేశారు.రూ.25 లక్షలు కట్నం ఇచ్చారు. ఫిజియోథెరపీ చదివిన ప్రవీణ్ వృత్తి రీత్యా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. కుమారి, ప్రవీణ్ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు కృషిక(5), కృతిక(3) ఉన్నారు. 20 రోజుల క్రితం ప్రవీణ్ తన స్వగ్రామం బావోజితండాకు భార్యా పిల్లలతో వచ్చాడు. ఈనెల 3న వివాహ దినోత్సవం ఉండగా, ప్రవీణ్ అందుబాటులో ఉండకపోవడంతో కుమారి తన ఇద్దరు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసింది.ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ప్రవీణ్ తన భార్యా పిల్లలతో కలిసి మంచుకొండ నుంచి భావోజీతండాకు కారులో ప్రయాణిస్తుండగా కారు రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కృషిక, కృతిక అక్కడికక్కడే మృతి చెందగా, కుమారిని జిల్లా ప్రభుత్వ హాస్పటల్ కి తరలిస్తుండగా కన్నుమూ సింది. ప్రవీణ్ మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అతడిని హైదరాబాద్ కు తరలించారు.రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న కుమారి తల్లి దండ్రులు, బందువులు జిల్లా ప్రభుత్వ హాస్పటల్ కు చేరుకున్నారు. ప్రవీణ్ కావాలనే రోడ్డు ప్రమాదం చేశాడని ఆందోళన చేశారు. కుమారి తండ్రి హరిసింగ్ విలేకర్లతో మాట్లాడుతూ తన కూతురు, అల్లుడుకు మధ్య 11 నెలలుగా వివాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ హాస్పటల్లో పని చేస్తున్న కేరళ అమ్మాయితో తన అల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో కలిసి కేరళ వెళ్లాడని తెలిపారు.ఆ తర్వాత అతడి ఆచూకీ కనుగొని తీసుకువచ్చి హన్మకొండ ప్రాంతంలో పసరు మందు తాగించామని, అయినా ప్రవీణ్ గొడవలు మానలేదని తెలిపారు. ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న నువ్వు నాకు వద్దని, చంపుతా అంటూ కుమారిని తరుచూ వేధించేవాదని వాపోయారు. కావాలనే కారును చెట్టుకు ఢీ కొట్టించి తల్లి, ఇద్దరు ఆడ పిల్లల మరణానికి కారణమయ్యాడని అతను రోదించారు. ఎన్నో దేవుళ్లకు పూజలు చేసిన తర్వాత తమకు కుమారి పుట్టిందని, రూ.25 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article