మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తీవ్రస్థాయిలో లైంగిక అఘాయిత్యాల ఆరోపణలు రావడంతో విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణ లైంగిక దాడుల గురించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, ఈ కేసులను సిట్ విచారిస్తోంది. తాజాగా, ప్రజ్వల్ రేవణ్ణ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతానని వెల్లడించారు. సిట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ప్రజ్వల్ రేవణ్ణ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని అన్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే తాను విదేశీ పర్యటనకు వెళ్లానని, పారిపోలేదని వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 26న ఎన్నికల ముందు వరకు తనపై ఎలాంటి కేసు లేదని, విదేశీ పర్యటనకు వెళ్లగానే ఆరోపణలు మొదలయ్యాయని ప్రజ్వల్ రేవణ్ణ వ్యాఖ్యానించారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని… రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మే 31న సిట్ విచారణకు హాజరై వివరాలు అందిస్తానని వెల్లడించారు.