Wednesday, September 17, 2025

Creating liberating content

తాజా వార్తలుఆ రెండు గంటలు ప్రత్యక్ష నరకమే.. సింగపూర్ ఫ్లైట్ బాధితులు

ఆ రెండు గంటలు ప్రత్యక్ష నరకమే.. సింగపూర్ ఫ్లైట్ బాధితులు

ఆకాశంలో సాఫీగా వెళుతున్న విమానం ఉన్నట్టుండి వేగంగా కిందికి జారిపోతుండడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని సింగపూర్ ఫ్లైట్ లోని ప్యాసింజర్లు చెప్పారు. ఆ రెండు గంటల ప్రయాణం ప్రత్యక్ష్య నరకంలా అనిపించిందన్నారు. రెండు రోజుల తర్వాత కూడా భయం వీడలేదని వివరించారు. తాజాగా ఆ భయంకర అనుభవం గురించి కొంతమంది ప్రయాణికులు మీడియాకు వివరించారు. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆకాశంలో కుదుపుల (టర్బులెన్స్) కు గురికావడం, అందులోని 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందికి గాయాలవడం తెలిసిందే. దీంతో థాయ్ లాండ్ లోని సువర్ణభూమి విమానాశ్రయంలో విమానాన్ని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో 74 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా వందమందికి పైగా గాయాలయ్యాయి. ప్రస్తుతం 20 మంది ఇంకా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు.లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం మయన్మార్ పైన గగనతలంలోకి ఎంటరయ్యాక తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఆ సమయంలో ఫ్లైట్ సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు రెడీ అవుతున్నారని ప్రయాణికులు చెప్పారు. ప్రయాణం సాఫీగా సాగుతోందని, సీట్ బెల్ట్ తీసేయవచ్చని పైలట్ అనౌన్స్ చేయడంతో తన బెల్ట్ విప్పేశానని ఓ ప్రయాణికుడు చెప్పాడు. కాసేపటికే విమానం వేగంగా కిందికి జారిపోవడం మొదలైందని తెలిపాడు. దీంతో తాను సీట్లో నుంచి ఎగిరి పైకప్పుకు తాకి కిందపడ్డానని, ఎయిర్ హోస్టెస్ సిద్ధం చేస్తున్న బ్రేక్ ఫాస్ట్ అయిటమ్స్ చెల్లాచెదురయ్యాయని వివరించాడు. మరికొంతమంది ప్రయాణికులు విసిరేసినట్లు ఓ మూలకు పడ్డారని చెప్పాడు. విమానం కూలిపోతోందని భయపడ్డామని, తన తోటి ప్రయాణికుల అరుపులు, కేకలతో భయంకర వాతావరణం నెలకొందని అన్నాడు. ఆ భయంకరమైన క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ ఆందోళన కలుగుతోందని వివరించాడు. విమానం పైకప్పుకు చాలా చోట్ల సొట్టలు (డెంట్స్) పడ్డాయని చెప్పాడు. విమానం థాయ్ లాండ్ లో ల్యాండయ్యాక ప్రాణాలు కుదుటపడ్డాయని వివరించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article