జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ అండర్ 7-9 లో ద్వితీయ స్ధానం
పోరుమామిళ్ల:
గత రెండు రోజులుగా గోవా రాష్ట్రం లోని పనాజీలో జరుగుతున్న జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో అండర్- 7-9 కేటగిరీలో కలసపాడు మండలం కడప జిల్లా దిగువ తంబళ్లపల్లెకు చెందిన చిన్నారి పల్లె ధృతి ద్వితీయ స్థానం సాధించింది. ధృతి చిన్నప్పటి నుంచి స్కేటింగ్ లో ఆసక్తి చూప డంతో అనంతపురం జిల్లాలో గ్రామీణ నీటిపారుదలశాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తల్లిదండ్రులు పల్లె శివ క్రిష్ణారెడ్డి, పావనిలు ప్రోత్సహించారు. ఈ క్రమంలో తాలుకా, డివిజన్ స్థాయిలో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని పలు ర్యాంకులు సాధిం చింది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబరులో విశాఖపట్నంలో జరిగిన ఏపీ రోలర్ స్కేటింగ్ లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి, జాతీయ స్థాయికి ఎంపికైంది. ప్రస్తుతం గోవాలో వివిధ కేటగిరీల్లో మూడు రోజులుగా జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ లో ద్వితీయ స్థానం సాధించిన ధృతికి వారి సమీప బంధువు,ఎస్టీయు రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శి పి.రమణారెడ్డి అభినందనలు తెలిపారు.రమణారెడ్డి మాట్లాడుతూ పిల్లలలో ఉన్న ఆసక్తిని గమనించి,ఆయా రంగాలలో ప్రోత్సహించినపుడే వారి ప్రతిభ బయటపడుతుందన్నారు. పిల్లలు కూడా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అభినందనలు తెలిపిన వారిలో మాజీ జడ్పీటీసి సభ్యుడు నందిగారి వెంకట సుబ్బారెడ్డి,పల్లె ఉమామహేశ్వర రెడ్డి,జి.వెంకటరెడ్డి,బి.గోపాల్ రెడ్డి,జి.ప్రసాదరెడ్డి,పల్లె రామక్రిష్ణా రెడ్డి,పల్లె హరిఓబుళరెడ్డి తదితరులు ఉన్నారు.