చంద్రగిరి:
ప్రపంచ అధిక రక్తపోటు దినం సందర్భంగా చంద్రగిరిలోని మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ (ఎం.ఆర్.హెచ్.ఆర్.యు) మరియు రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్. హెచ్. టి. సి.) ల ఆధ్వర్యంలో ఈ రోజు మే 17వ తేదీన నరసింగాపురం గ్రామంలోని హరిజనవాడలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహింపబడింది.
దీనిలో భాగంగా ఎం.ఆర్.హెచ్.ఆర్.యు శాస్త్రవేత్తలు డా. జి. వెన్నెల సాహితి, డా. యు.వి. ప్రసాద్ మరియు ఆర్. హెచ్. టి. సి. హెల్త్ ఎడ్యుకేటర్ ఎం. తాతాబాయి మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక రక్తపోటు దినం ఇతివృత్తం (థీమ్) ప్రకారం ప్రజలు తమ రక్తపోటును ఖచ్చితంగా నిర్ధారించుకోవాలని, దానిని నియంత్రణలో ఉంచాలని తద్వారా ఎక్కువ కాలం జీవించాలని అన్నారు. అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యానికి ప్రధాన ప్రమాద కారకం మరియు జీవన నాణ్యతను గణనీయంగా తగ్గిస్తుంది అని, సరైన ఆహారపు అలవాట్లు, మంచి జీవన శైలి, తగిన వైద్య సహాయంతో దీనిని సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చునని తెలిపారు.
ఈ వ్యాధి ఉన్నవారు రక్తపోటును కొలిచే పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, వాటిని సరిగా ఉపయోగించే పద్థతులను అలవాటు చేసుకోవాలని తెలిపారు. గ్రామీణులకు దీని గురించి అవగాహన అందించ డంలో ప్రభుత్వ ఆరోగ్య కార్య క ర్త లు, స్వ చ్ఛంద కార్య క ర్త లు కీల క పాత్ర పోషిస్తున్నారు అని అన్నారు. తాజా పండ్లు, కూరగాయలు మరియు పౌష్టికాహారం తీసుకోవడం, ఆహారంలో ఉప్పును తక్కువగా వాడడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ-యోగా-ధ్యానం చేయడం, మానసిక ఒత్తిడి నియంత్రణ మరియు నిర్వహణ, ఆల్కహాల్ తీసుకోకపోవడం, పొగాకును ఏ విధంగానూ వాడకపోవడం మొదలగు వాటి వలన రక్తపోటును అదుపులో ఉంచవచ్చునని సూచించారు. హైదరాబాదు లోని జాతీయ పోషకాహార సంస్థ పరిశోధనల మరియు సూచనల మేరకు ఒక మనిషి తన ఆహారంలో ఒక రోజుకు కేవలం 5 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలని తెలిపారు.అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యులు సూచించిన మందులను తప్పనిసరిగా క్రమపద్ధతిలో వాడకం చాలా ముఖ్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.హెచ్.ఆర్.యు అడ్మిన్ వాసుదేవ; ఆర్. హెచ్. టి. సి. హెల్త్ సూపర్వైజర్ కె. నారాయణరాజు, పి.హెచ్.ఎన్. పద్మావతమ్మ, ఎ.ఎన్.ఎం. శశిరేఖ, సుగుణ; ఆశావర్కర్లు దివ్య, తులసి మరియు నరసింగాపురం గ్రామ హరిజనవాడ ప్రజలు పాల్గొన్నారు.
