బుట్టాయగూడెం. పోలవరం నియోజకవర్గం అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం పాలన శాపంలా మారిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే వరంలా మారి నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని ఎన్డీఏ కూటమి నేతలు అన్నారు. బుట్టాయగూడెంలో టిడిపి నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు పరిపాలన హయాంలో 72% పూర్తి చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అరకొర ప్యాకేజీలు, పూర్తికాని కాలనీల నిర్మాణాలు, కనిపించని భూమికి భూమి వంటి సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. నిరుద్యోగులు అవకాశాలు లేక తమ జీవితంలో కీలకమైన ఐదు సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. నాసిరకం మద్యంతో కష్టజీవుల ఆరోగ్యాలతో ఆట్లాడుకున్నారని విమర్శించారు. ఆలోచన లేని విధానాలతో విద్యా, వైద్య రంగాలు పూర్తిగా దయనీయమైన స్థితికి చేరుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై ఇతర రాష్ట్రాల వారు జోకులు వేసుకునే స్థితికి చేరాయని అన్నారు. ఐదు సంవత్సరాల అభివృద్ధి నిరోధక, అవినీతి జగన్ పాలనకు చరమగీతం పాడటానికి మే 13 వ తేదీన అందరూ ఏలూరు పార్లమెంట్ కూటమి ఎంపి అభ్యర్ధి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు ఎన్నికల గుర్తు సైకిల్, పోలవరం నియోజకవర్గం కూటమి ఎంఎల్ఏ అభ్యర్థి చిర్రి బాలరాజుకు గాజుగ్లాసు గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ది జరుగుతుందని అందరి భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. నియోజకవర్గంలో వరదల సమయంలో కానీ, పార్టీ కార్యక్రమాల పట్ల కానీ బొరగం శ్రీనివాసులు చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గం పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, జనసేన పార్టీ నియోజకవర్గ పరిశీలకులు సౌజన్య, మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, ఏలూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యంట్రప్రగడ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, తెదేపా సీనియర్ నాయకులు పరిమి రాంబాబు, తదితరులు ఉన్నారు.

