విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ కావడం పట్ల కూటమి నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ప్రధాని మోదీ ఇప్పటికే దీనిపై ట్వీట్ చేశారు. తాజాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో తమ స్పందన వెలిబుచ్చారు. ప్రధాని మోదీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. ఇది నిజంగా మరపురాని రోడ్ షో అని పేర్కొన్నారు. విజయవాడ రోడ్ షో ఫొటోలను మోదీ ఎక్స్ లో పంచుకోవడాన్ని ప్రస్తావిస్తూ… ఈ అద్భుతమైన గ్లింప్స్ ను మా ప్రజలతో పంచుకున్నందుకు, ఏపీకి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మీరు, నేను, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్న రోడ్ షోతో మా ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశాదీపం వెలిగించినట్టయింది అని చంద్రబాబు వివరించారు. పవన్ కల్యాణ్ కూడా రోడ్ షోపై ట్వీట్ చేశారు. “ప్రధాని మోదీ గారూ… ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. మీరు సంకల్పించిన వికసిత భారత్ కార్యాచరణ కోసం మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం” అంటూ పవన్ పేర్కొన్నారు.

