కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఏపీ దిశ దశ మార్చే ఎన్నికలు మే 13న రాబోతున్నాయని అన్నారు. గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం ఎంపీ స్థానం జనసేన అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తున్నారని వెల్లడించారు. వాళ్లిద్దరూ వైసీపీలో బానిసలుగా ఉండలేక ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారని… వెంకట్రావు టీడీపీలో చేరారని, బాలశౌరి జనసేన పార్టీలో చేరారని వివరించారు. పైకి సున్నితంగానే కనిపించినా, కార్యకర్తలకు కష్టం వస్తే బాలశౌరి ఎంతో బలంగా నిలబడతారని, ఆ విషయం మొన్న మచిలీపట్నంలో స్పష్టమైందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు బాగా ఇష్టమైన నాయకుడు చింతమనేని ప్రభాకర్ అని పవన్ వెల్లడించారు. ఆయనతో తాను గొడవ పెట్టుకున్నానని తెలిపారు. “ఎవరు స్నేహితులు అవుతారు? గొడవ పెట్టుకున్న వాళ్లే స్నేహితులు అవుతారు. దెందులూరు నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తానంటే నేను గెలిపిస్తాను అని చెప్పిన వ్యక్తి చింతమనేని. అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా నాకు అందంగా ఉంటుంది… ప్రేమ ఉన్న చోటే గొడవ ఉంటుంది. ఏమంటారు ప్రభాకర్ గారూ? మా ఇద్దరికీ ఆ సామరస్యం కుదిరింది. గొడవతో మొదలైన స్నేహం చాలా బలంగా ఉంటుందని చెబుతారు” అంటూ పవన్ వివరించారు.

