గాజువాక
— మోడీ, చంద్రబాబు విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాలో
— గాజువాక :- అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి అమర్నాథ్ వెల్లడి.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దు అంటూ 1180 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటాన్ని, వారి సెంటిమెంటును ప్రధాని ఏమాత్రం పట్టించుకోలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యనించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో అమర్నాథ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రధాని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. అదే వేదిక మీద ఉన్న చంద్రబాబు నాయుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమని అన్నారు. ప్రధాని సభలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటేకరించబోను అని చెబితే, తాను పోటీ నుంచి తప్పుకుంటానని, 72 గంటలకు ముందు ప్రకటన చేసి ఇప్పటివరకు వేచి చూసానని, కానీ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోదీ నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదని అమర్నాథ్ పేర్కొన్నారు. దీన్ని బట్టి ప్రధాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదన్న సంకేతాలు ఇచ్చినట్టు భావించాల్సి వస్తుందని అమర్నాథ్ అన్నారు.
ఇదిలా ఉండగా ఐదు సంవత్సరాల కిందట జరిగింది ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని, అమరావతి కుంభకోణంగా మారిందని చెప్పారు. ఇప్పుడు మోడీ తన రాజకీయ అవసరాల కోసం యూటర్న్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అమర్నాథ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన 22 వేల కోట్ల రూపాయల కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని, మోడీ ప్రభుత్వం ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదని అమర్నాథ్ ప్రశ్నించారు. బిజెపితో జగన్మోహన్ రెడ్డి
చీకటి ఒప్పందాలు చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది… ఇప్పుడు బిజెపితో అంట కాకుతూ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్న టిడిపిది చీకటి ఒప్పందం కాదా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. రైల్వే జోన్ కార్యాలయం నిర్మించేందుకు భూమి ఇవ్వలేదంటూ ప్రధాని చేసిన ప్రకటనను అమర్నాథ్ ఖండిస్తూ విశాఖలో అత్యంత విలువైన 43 ఎకరాల స్థలాన్ని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, ఈ విషయం తెలిసిన ప్రధాని తెలియనట్టు అబద్ధాలు ఆడటం బాధాకరమని అమర్నాథ్ అన్నారు. రైల్వే జోన్, పోలవరం తదితర అంశాలపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా ప్రధాని వెను తిరగడం ప్రజలను విస్మయానికి గురి చేసిందని చెప్పారు.
రాజకీయాల్లో తానే గొప్పవాడిని, మంచి వాడినని ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేశారని అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని తనకు తన కుమారునికి రాజకీయ భవిష్యత్తు లేదని తెలుసుకున్న చంద్రబాబు మతిభ్రమించి జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారని అమర్నాథ్ అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి వస్తున్నాడని ప్రజలు ఏమాత్రం ఆయనను నమ్మవద్దని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఎన్నికల్లోకి వస్తున్న ఆయనకు బుద్ధి చెప్పాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ అంశంపై ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఈ చట్టం చారిత్రాత్మకమైనదని తెలుగుదేశం సభ్యులు పేర్కొని ఇప్పుడు దానిపై విమర్శలు చేయడం అర్ధరహితమని అమర్నాథ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా దానిపై చర్చించకుండా తెలుగుదేశం సభ్యులు సభ నుండి బయటకు వెళ్లారని వీటన్నిటిని బట్టి వారికి స్టీల్ ప్లాంట్ మీద గాజువాక ప్రజల మీద, రాష్ట్రం మీద ఎంతటి చిన్నచూపు ఉందో అర్థం అవుతోందని అమర్నాథ్ అన్నారు.

