జగ్గంపేట
ఎన్నికలలో కులం- మతం – డబ్బు- మత్తు ప్రలోభాలకు లొంగకుండా ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి
కడితి సతీష్ పిలుపునిచ్చారు. జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు , స్వతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కడితి సతీష్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ నాయకులు వచ్చి, ఓట్లు వేయించుకొని, నెగ్గి ప్రజలను పరిపాలిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు, వారి అభివృద్ధి, పట్టించుకునేది ఏమీ ఉండడం లేదని ఆయన విమర్శించారు. ప్రధాన,ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సంక్షేమ,ఉచిత పథకాలు పేరుతో ప్రజలను గందరగోళంలోకి దింపి అధోగతి పాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా- ఉద్యోగ అవకాశాలు – మద్యం నిర్మూలించడం మొదలైన సమస్యలపై రాజకీయ నాయకులు నోరు మెదపకపోవడం చాలా దారుణమన్నారు. అందుకే విద్యార్థి -మేధావులు -రైతులు- కార్మికులు – యువకులు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై రాజకీయ నాయకులను ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు కర్నాకుల రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్, డాన్ శ్రీను, గ్రామస్తులు పాల్గొన్నారు

