- పిసిసి మీడియా ఛైర్మన్ డాక్టర్. నర్రెడ్డి తులసిరెడ్డి
వేంపల్లె
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 9 గ్యారెంటీలతో రాష్ట్ర ప్రగతి సాధ్యం అవుతుందని పిసిసి మీడియా ఛైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 9 గ్యారంటీలతో కాంగ్రెస్ కు విజయ సంకేతాలు ఉన్నట్లు చెప్పారు. 5 గ్యారెంటీలతో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అలాగే 6 గ్యారెంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందని తెలిపారు. అదేవిధంగా 9 గ్యారెంటీలతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రూ 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ రైతుల పాలిట వరం అన్నారు. ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ బ్యాంకు అకౌంట్లో ఏడాదికి లక్ష రూపాయలు వేసే మహాలక్ష్మి పథకం మహిళల పాలిట వరప్రసాదిని చెప్పారు. రూ 5 లక్షల రూపాయలతో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం పేదల పాలిట వరం లాంటిదని తెలిపారు. వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ 4వేలు, వికలాంగులకు రూ 6 వేలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 2.25 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ యువతకు వర ప్రసాదిని అన్నారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య విద్యార్థుల పాలిట వరం అన్నారు.

