హిందూపురం టౌన్
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కొట్టాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల బరిలో దిగారు. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో సైతం కంచుకోటను నిలుపుకోవాలని బాలయ్య కుటుంబం తహతహలాడుతోంది. ఇందులో భాగంగానే కుటుంబ సభ్యులందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి, చిన్న కుమార్తె తేజస్వినిలు ప్రచారం నిర్వహించగా బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి స్థానికంగానే ఉంటూ బాలయ్యకు తోడు ప్రచారం హోరెత్తిస్తున్నారు.
మంగళవారం బాలకృష్ణ పట్టణంలో మండుటెండలను సైతం లెక్కచేయకుండా తనదైన శైలిలో రోడ్ షో, ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మరోపక్క బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర దేవి ప్రచారంతో పాటు వీరశైవ లింగాయత్ లింగాయతుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి తన భర్త బాలకృష్ణతో పాటు ఎంపీ అభ్యర్థి పార్థ సారథికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. గెలిచిన అనంతరం లింగాయత్ ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ పట్టణంలో ఇంటింటికి వెళ్లి తన సోదరుడు బాలకృష్ణను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా తన పంచ్ డైలాగులతో బాలకృష్ణ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షులు వడ్డె అంజినప్ప, బాలకృష్ణ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నంబూరి సతీష్, తెలుగు యువత అధ్యక్షులు సురేష్ నాయక్, పూలకుంట సర్పంచ్ మంజునాథ్, న్యాయవాది శివశంకర్, పట్టణ అధ్యక్షులు రమేష్ కుమార్, పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.


