హిందూపురం టౌన్
గోరంట్ల సబ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ శబరిని వేధిస్తూ ఆత్మహత్యయత్నానికి కారణమైన ఎం ఎల్ హెచ్ పి గౌతమిని వెంటనే సస్పెండ్ చేసి, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. గోరంట్ల సబ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ శబరి ఎం ఎల్ హెచ్ పి గౌతమి వేధింపులు భరించలేక ఫ్లోర్ యాసిడ్ తాగి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. వెంటనే శబరిని తోటి ఉద్యోగులు, బంధువులు గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి రిఫర్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈఎస్ వెంకటేష్, జెడ్ పి శ్రీనివాసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించి, జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హత్యాయత్నానికి పాల్పడిన శబరి మాట్లాడుతూ, సబ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న ఎం ఎల్ హెచ్ పి గౌతమి తనను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేసిందన్నారు. చివరికి సకాలంలో ఒక ఇంజక్షన్ దొరకపోయినా దానికి కూడా కారణం నేనే నని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. స్వీపర్లు చేసే పనులు సైతం తనతోనే చేయిస్తూ చిత్రహింసలకు గురి చేసిందని ఆరోపించారు. ఈ హింసలను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆరోపించింది. అనంతరం ఈఎస్ వెంకటేష్ మాట్లాడుతూ , గోరంట్ల సబ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న ఎం ఎల్ హెచ్ పి గౌతమి ఆశా వర్కర్లను విధుల పేరుతో వేధింపులకు పాల్పడుతూ ఉందన్నారు. ఈమెకు ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వారిని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం సైతం గోరంట్ల మండల కేంద్రంలో 104 వచ్చిన సందర్భంగా వాటి సేవల్లో ఉన్న ఆశా వర్కర్ శబరి పై యల్ హెచ్ పి గౌతమి ఆవేశంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడిందని , ఈ అవమానాన్ని భరించలేక ఆశా వర్కర్ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఇది ఆత్మహత్య కాదని వేధింపులతో జరిగిందని, దీనిని హత్యగా పరిగణిస్తూ గౌతమిని వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు ఈమెపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి ఆశా వర్కర్ కు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామకృష్ణ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

