వైసిపి జిల్లా అద్యక్షులు నవీన్ నిశ్చల్
హిందూపురంటౌన్
గత ఐదేళ్లల్లో సంక్షేమ పథకాలను అర్హులకు అందించడమే కాకుండా ఎంతో అభివృద్ధి చేశామని, వాటిని చూసి వైసిపిని గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అద్యక్షులు నవీన్ నిశ్చల్ అన్నారు. మంగళవారం పట్టణంలో వైసిపి ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు శాంతమ్మ, దీపికల తో కలిసి రోడ్ షో, ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ,సూపర్ సిక్స్ అంటూ అబద్ధపు హామీలతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబునాయుడు సిద్ధం అయ్యారని, పుట్టుక తో వచ్చిన బుద్ధులు పిడకలతో పోతాయా అంటూ సెటైర్ వేశారు. మామకు వెన్నుపోటుతో మొదలైన మోసాలు అధికారం లోకి వచ్చాక యువతను, వృద్ధు లను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు. బావకు తగ్గ బామ్మర్థి బాలకృష్ణ అని. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను నిలువున మోసం చేశారన్నారు. 2014లో పురంలోనే స్థిర నివాసం ఉంటానని, అద్దె ఇంట్లో గృహ ప్రవేశం చేసి ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టి, ఎన్నికల అనంతరం తెలంగాణలో ఉంటున్నారని. ఇతనికి ప్రజల సంక్షేమం పట్టదన్నారు. హిందూపురంలో 40 ఏళ్ళ నుంచి టిడిపి పార్టీ అధికారంలో ఉందని, అయితే అభివృద్ధి ఏమి జరగలేదన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచి హైదరాబాద్ కే పరిమితమయ్యారని, అందరికి మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తేనే అభివృద్ధి. సంక్షేమం కొనసాగుతాయన్నారు. మళ్లీ సంక్షేమ ప్రభుత్వం కోసం వైసిపిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మెన్ లు జబీవుల్లా, బలరామిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

