అట్టహాసంగా ఊరేగింపుకు సన్నాహాలు
హిందూపురం చేరుకున్న బాలయ్య
హిందూపురం లోకసభ నియోజకవర్గ వ్యాప్తంగా తరలిరానున్న శ్రేణులు
హ్యాట్రిక్ సాధన తో పాటు భారీ మెజార్టీతో బాలయ్యను గెలిపించేందుకు పావులు హిందూపురం :తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా మూడోసారి పోటీ చేస్తున్నారు. బాలకృష్ణను అత్యంత మెజార్టీతో గెలిపించడంతోపాటు హ్యాట్రిక్ సాధించాలని తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నందమూరి బాలకృష్ణ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాను నిర్ణయించిన ముహూర్తం మేరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:00 లోపల బాలయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం శ్రీ సూ గురు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి వాల్మీకి సర్కిల్, చిన్న మార్కెట్ సర్కిల్, మెయిన్ బజార్ గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీకి టిడిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అంబేద్కర్ సర్కిల్లో కనీవినీ ఎరుగని రీతి లో భారీ బహిరంగ సభకు ప్రణానిక రూపొందిస్తున్నారు. నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త పావులూరు శ్రీనివాసరావు, డాక్టర్ సురేంద్రబాబు, ఎమ్మెల్యే సమీప బంధువు ప్రసాద్ తదితరుల నేతృత్వంలో బాలకృష్ణ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని…. భారీ ర్యాలీని నిర్వహించేందుకు పగడ్బందీగా రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అటు తెలుగుదేశం ఇటు ఎన్డీఏ కూటమిల అభ్యర్థుల విజయం కోసం నందమూరి బాలకృష్ణ పర్యటన విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. దీంతో మూడోసారి ఇక్కడి నుండి పోటీ చేస్తున్న బాలకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా వ్యూహాలు రచిస్తున్నారు. గత ఐదు రోజులుగా నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి పర్యటన విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ తరుణంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రయ త్నాలు చేస్తోంది. ఇకపోతే గురువారం సాయంత్రం హిందూపురం కు చేరుకున్న నందమూరి బాలకృష్ణ కు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ నామినేషన్ ఊరేగింపుకు అటు భారతీయ జనతా పార్టీ… ఇటు జనసేన నేతలు కూడా జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు.