ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ జవహర్ రెడ్డి
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 26, 27 తేదీల్లో తిరుపతి సందర్శించ నున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడి ఈనెల 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపతి విమాశ్రయానికి చేరుకుని తదుపరి తిరుమల వెళ్ళి రాత్రి బస చేస్తారన్నారు. 27వతేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నుండి హైదరాబాదు బయలుదేరి వెళతారని పేర్కొన్నారు. అందువల్ల ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై వీడియో లింక్ ద్వారా పాల్గొన్న తిరుపతి జిల్లా కలక్టర్ కె.వెంకట రమణారెడ్డి, టిటిడి ఇఓ ధర్మారెడ్డి, తిరుపతి ఎస్పి పరమేశ్వర రెడ్డిలతో సిఎస్ జవహర్ రెడ్డి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని మోడి తిరుపతి విమానా శ్రయం నుండి తిరుమల కొండపైకి చేరుకునే రోడ్డు మార్గం వెంబడి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే 27వ తేదీ ఉదయం తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే సమయంలో వివిఐపిల పర్యటనల నిబంధనల ప్రకారం అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని టిటిడి ఇఓ ధర్మారెడ్డిని ఆయన ఆదేశించారు. ఇంకా ప్రధాని పర్యటనకు సంబంధించి వివిధ శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లన్నిటినీ ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్ట మైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారు లను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరకల వలవెన్, రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, డిఎంఇ డా.నర్సింహం, ఐఅండ్ పిఆర్ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత పాల్గొన్నారు. ఇంకా వీడియో లింక్ ద్వారా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.