Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలు2024 ఎన్నికల్లో..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సంపూర్ణ ప్రజా మద్దతు

2024 ఎన్నికల్లో..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సంపూర్ణ ప్రజా మద్దతు

  • తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడి
  • ‘ వై ఏపీ నీడ్స్ జగన్ ‘ కార్యక్రమానికి వెల్లివిరిసిన ప్రజాదరణ

తిరుపతి రూరల్,

      రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సునామీ సృష్టించనుందని తుడా ఛైర్మెన్, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయ కర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనంతపురం జిల్లా ‘రాప్తాడు సభ’ కు తరలివచ్చిన జనసమోహమే తార్కాణంగా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు చారిత్రక విజయం కోసం ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే కదం తొక్కుతున్నారని తెలిపారు. 2019 ఎన్నికల కంటే ఈసారి వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయదుందుభి మోగించనుందని వెల్లడించారు. ప్రజా మద్దతు సీఎం జగన్మోహన్ రెడ్డికి పుష్కలంగా ఉందన్నారు.

మంగళవారం తిరుపతి రూరల్ మండలంలో తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటించారు. పద్మావతీ పురం, శ్రీనివాసపురం, సాయి నగర్, కే.సి.పేట, వేదాంత పురం పంచాయతీలలో ‘ వై ఏపీ నీడ్స్ జగన్ ‘ కార్యక్రమానికి ప్రజా స్పందన వెల్లివిరిసింది. ముందుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పార్టీ  శ్రేణులు బాణసంచా పేలుళ్లు, పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గజ మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయా పంచాయతీల్లో సంక్షేమం, అభివృద్ధికి కేటాయించిన నిధుల జాబితా బోర్డ్ ను ఆవిష్కరించారు. సాయి నగర్ పంచాయతీలో రూ.8.21 కోట్లతో చేపట్టిన సచివాలయం భవనాలు, సీసీ రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. మహిళా సాధికారతకు దోహదం చేసే వైఎస్ఆర్ ఆసరా నిధుల చెక్కులను మహిళలకు అందజేశారు.

     ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మరో వైపు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా సుపరిపాలనతో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులతో చేకూరిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ప్రజా మద్దతు రోజు రోజు కు పెరుగుతోందన్నారు. 57 నెలల పాటు నిర్విరామంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పాలన కోసం.. మరోసారీ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు మీరు సిద్ధమా.. అని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేం సిద్ధమే అంటూ ప్రజలు ప్రతిస్పందించారు.

ప్రజాసేవ చేయాలనే సంకల్పం..

ప్రజా సేవ చేయాలనే సంకల్పం, చంద్రగిరి నియోజకవర్గం ప్రగతి పథంలో నడిపించాలన్న ఆశయం తనకు బలంగా ఉందన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. నా నియోజకవర్గ అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు రూపొందించానని వెల్లడించారు. తన తండ్రి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు నా ప్రజల కోసం మరింత శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న వైఎస్సార్ ఆరోగ్య సురక్ష, రూ.25 వేలు విలువ కలిగిన ఎమ్మెల్యే పెళ్లి కానుకలను చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందస్తుగానే అమలు చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు నోచుకుందన్నారు. అంతే కాకుండా యువతకు క్రీడా పోటీలు, జాబ్ మేళాలు నియోజకవర్గంలో నిరంతరాయంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఏటా పండుగలకు ప్రజలకు కానుకలు అందించి నా కుటుంబ సభ్యులు అన్న భావనతో సంతృప్తి చెందుతుంటారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి పల్లె ప్రగతి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. మారు పల్లెలకు కూడా రోడ్డు నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. కరోనా కాలంలో గుర్తు రాని ప్రజలు ఎన్నికలు సమీపించగానే వాలి పోయారని ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవ చేయాలంటే అధికార పార్టీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే విధానాన్ని నా తండ్రి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి తెలుసుకున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమర్థవంతంగా ప్రజలకు సేవ చేశారని అనిపిస్తేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించమని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోరారు.

పార్టీ జెండా ఆవిష్కరణ

    ప్రజా క్షేత్రంలో మెరుగైన పాలనకు ప్రతీకగా నిలిచిన పార్టీ జెండా ఆవిష్కరణ గౌరవంగా స్వీకరిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు గర్వంగా చెప్పుకునేలా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.  ఆయన నాయకత్వం పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసాన్ని మరింతగా పెంచిందన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. జై జగన్ నినాదాలతో పార్టీ కేడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపారు.

అభివృద్ధి మా అభిమతం..

అభివృద్దే అభిమతం గా ఈ ఐదు పంచాయతీల్లో రూ.36.03 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, రూ.111 కోట్ల సంక్షేమ నిధులు అర్హులకు అందజేశామన్నారు. పద్మావతీపురం పంచాయతీలో అభివృద్ధి పనులకు రూ.7.04 కోట్లు ఖర్చు చేయగా, సంక్షేమ పథకాల ద్వారా  రూ.19.82 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. అలాగే శ్రీనివాసపురంలో రూ.4.76 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.12.70 కోట్ల సంక్షేమ నిధులు అందజేశామన్నారు. కేసీ పేట పంచాయతీలో రూ.4.61 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, రూ.26.97 కోట్ల సంక్షేమ నిధులు అర్హులకు అందజేయడం జరిగిందన్నారు. సాయి నగర్ లో రూ.8.23 కోట్లు అభివృద్ధి పనులకు, సాయి నగర్ – 1 లో రూ. 11.87 కోట్లు, సాయి నగర్ – 2లో రూ.16.33 కోట్లు సంక్షేమ నిధులు పంపిణీ జరిగిందని వెల్లడించారు. వేదాంతపురం పంచాయతీలో రూ. 11.39 కోట్లు అభివృద్ధి పనులు చేపట్టగా, రూ.23.90 కోట్లు సంక్షేమ నిధులు అందించామని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ యశోద, వైస్ ఎంపీపీ విడుదల మాధవ రెడ్డి, డివిజనల్ అధ్యక్షులు లోకేశ్వర్ రెడ్డి, సర్పంచ్ పిపాసి , నాయకులు నరేంద్ర రెడ్డి , వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article