విశాఖ బహిరంగసభలో పవన్ కళ్యాణ్
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో
వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇస్తే ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అందువల్ల చైతన్యం ఉన్న ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు వలస వెళ్లిపోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలోని 24 బీసీ కులాలను తెలంగాణలో గుర్తించడం లేదని, ఈ విషయంపై అక్కడి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని గురువారం జరిగిన విశాఖ సభలో ఆయన వైసీపీ పాలనను దుయ్యబట్టారు.
పొగడ్తలకు కాదు.. కష్టానికి ఉప్పొంగుతాను
సినిమాల్లో తనను ఆదరించడంతో ప్రజల కోసం పనిచేయడానికి ముందుకొచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కొందరు పొగిడితే ఉప్పొంగిపోతారని, కానీ తాను ప్రతి కష్టానికి మాత్రమే ఆనందపడతానని తెలిపారు. యువత భవిష్యత్ కోసం తాను తిట్లు తింటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత కు పాతికేళ్ల భవిష్యత్తును ఇస్తేనే తనకు సంతోషం కలుగుతుందన్నారు.
ఎన్నికల గురించి నేను ఆలోచించను
ఈ తరాన్ని కాపాడుతూ వచ్చే తరం కోసం తాను పని చేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖ బహిరంగసభలో మాట్లాడుతూ ఎన్నికల గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. యువతరం కోసమే నా ఆలోచన అని అన్నారు. అధికారం కోసం కాదు మార్పు కోసమే నాకు ఓట్లు కావాలన్నారు. డబ్బులు లేకుండా ఒంటి చేత్తో పార్టీని నడపడానికి మీరిచ్చిన ప్రేమాభిమానాలే కారణమని పేర్కొన్నారు