స్ట్రాంగ్ రూమ్ ప్రాంతంలో 144వ సెక్షన్ అమలు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ లు స్ట్రాంగ్ రూముల పరిశీలన.
హిందూపురం టౌన్ /లేపాక్షి : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు వివి ప్యాడ్లు భద్రపరచిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, బిట్ ఇంజనీరింగ్ కళాశాలలను శనివారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ,జిల్లా ఎస్పీ మాధవరెడ్డిలు ఆకస్మిక తనిఖీ నిర్వహించి ,భద్రతాపరమైన అంశాలను, సిబ్బందికి సూచనలు ,సలహాలను అందించారు .ఈ సందర్భంగా సంబంధిత లాగ్ పుస్తకంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంతకాలను చేశారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ,ఈవీఎంలు భద్రపరచిన గదుల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో కలిసి కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. సత్యసాయి జిల్లాకు చెందిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాడ్లు చాలా జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందన్నారు. బిట్ కళాశాలలో మడకశిర, కదిరి, పెనుగొండ ,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు వివి ప్యాడ్ల ను, హిందూపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఈవీఎంలు వీవి ప్యాడ్ లను భద్రపరచమన్నారు. అదేవిధంగా ధర్మవరం పుట్టపర్తి అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఈవీఎంలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో భద్రపరచడం జరిగిందన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ బిట్ ఇంజనీరింగ్ కళాశాల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులతో మాట్లాడుతూ, ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యేటంతవరకు స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మీ పైనే ఉందన్నారు. ఈ రెండు కేంద్రాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దీనికి తోడు సీసీ కెమెరాలు కూడా స్ట్రాంగ్ గదులకు నలువైపులా ఏర్పాటు చేశామన్నారు .ఈ రెండు కేంద్రాల్లో 144వ సెక్షన్ అమలులో ఉందని ఈ ప్రాంతాల్లో ఎవరు తిరగరాదని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ ,పుట్టపర్తి నియోజకవర్గ ఆర్వో భాగ్యరేఖ, ధర్మవరం నియోజకవర్గ ఆర్వో వెంకట శివ సాయి రెడ్డి, మడకశిర నియోజకవర్గ ఎన్నికల అధికారి గౌరీ శంకర్ లతోపాటు ఆయా నియోజకవర్గాల ఎన్నికల సహాయ అధికారులు, డిఎస్పీలు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.