ఊపిరి పీల్చుకున్న దాదాపు 150 గృహాల యజమానులు.
లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షి లోని పాత లేపాక్షి ,వీవర్స్ కాలనీల మీదుగా 60 సంవత్సరాల క్రితం వేసిన 11 కె.వి విద్యుత్ లైన్ మార్పు పనులు శనివారంతో ముగిసాయి. 60 సంవత్సరాల క్రితం లేపాక్షి సబ్ స్టేషన్ ప్రాంతం నుండి పాత లేపాక్షి, వీవర్స్ కాలనీ మీదుగా మైనారిటీ ఫంక్షన్ హాల్ వరకు 11 కె.వి విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో పాత లేపాక్షి, వీవర్స్ కాలనీలు అభివృద్ధి చెందడంతో ఆ విద్యుత్ లైన్ కాస్త ఇళ్లపైకి వచ్చింది. ఆ లైన్ కింద ఉన్న నివాసులు విద్యుత్ లైన్ కు తగిలి పలువురు గాయాలకు గురికాగా, మరి కొందరు అంగవైకల్యం చెందగా, మరి కొందరు మృతి చెందారు. ఈ 11 కె.వి విద్యుత్ లైన్ ను మార్చాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన ప్రయోజనం లేకపోవడంతో చివరకు మండల ఉపాధ్యక్షులు అంజన రెడ్డి, పాత లేపాక్షి కి చెందిన నాయకులు నిసార్ అహమ్మద్ తదితరులు గత ఏడాది నవంబర్ నెలలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆ మంత్రి ప్రజల సమస్యలను తీర్చేందుకు లైనును మార్చే విధంగా అధికారులను ఆజ్ఞాపించారు. విద్యుత్ శాఖ అధికారులు జనవరి నెల నుండి పనులు ప్రారంభించి విద్యుత్ లైనును పూర్తిగా మార్చివేసి చివరి పనులను శనివారం ముగించారు.