పీపుల్స్ మేనిఫెస్టో బుక్ లెట్ విడుదల
హిందూపురం టౌన్
హిందూపురం సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాంత చెరువులను హంద్రీనీవా జలాలతో నింపాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు రామకృష్ణ డాక్టర్ ఈ.టి. రామ్మూర్తి, డాక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పీపుల్స్ మేనిఫెస్టో బుక్ లెట్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జన విజ్ఞాన వేదిక రాజ్యాంగంలోని అంశాలకు అనుగుణంగా సైన్స్, శాస్త్రీయ దృక్పథం పై ప్రజల్లో ప్రచారం చేయడం జరుగుతోందన్నారు. సైన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు, విద్యా వైద్య రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలన్నారు. ఆరోగ్యాన్ని ప్రజల హక్కుగా చట్టబద్ధం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విభజన హామీలను, ప్రత్యేక హోదాను అమలు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని, విశాఖ ఉక్కును పరిరక్షించాలని, అత్యాధునికంగా తొమ్మిది విద్యాసంస్థలను ప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా హిందూపురం ప్రాంతంలో ఉన్న చెరువులను హంద్రీనీవా జలాలతో నింపి ఈ ప్రాంత రైతులకు సమృద్ధిగా సాగు జలాలను అందించాలన్నారు. అదేవిధంగా హిందూపురంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని, రింగ్ రోడ్డు నిర్మించడంతోపాటు భూగర్భ మురికి కాలవ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఆయా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జె వి వి ప్రతినిధులు రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఉమామహేశ్వర్, ఉగ్రప్ప,జియావుల్లా,ఆనంద్ రెడ్డి, కోదండరాములు, నాగరాజు గుప్త, నాగిరెడ్డి, అతావుల్లా, ఓబులేసు, కుళ్ళాయి రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.