కదిరి :కదిరి రూరల్ పరిధిలోని ఎరుకులవాండ్లపల్లి సమీపంలో వున్న హరీష్ పాఠశాలలో ప్రిన్సిపాల్ యం.యస్ కిరణ్ ఆధ్వర్యంలో గురువారం 10వ తరగతి విద్యార్థులకు సరస్వతీ పూజ నిర్వహించారు. పూజారి ప్రసాద్ రావు సరస్వతీ దేవి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విద్యార్థులందరూ పదో తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని దీవించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పదో తరగతి విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. ఆయన మాటల్లోనే.. “విద్యార్థులు ప్రతి రోజు రాత్రివేళల్లో 10 గంటల వరకు చదవాలి. మళ్లీ తెల్లవారుజామున 4.30 గంటలకు నిద్రలేచి రెండు గంటల పాటు చదివితే మంచిది. ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితులలోను రాత్రి పూట నిద్రాభంగం కానివ్వకండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం సమయంలో కాస్త వ్యాయామం చేస్తే మంచిది. రోజుకు తప్పకుండా కనీసం 6గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా జంక్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకుండా పౌష్టికాహారం తీసుకోవాలి. ఉదయం 8.30 గంటలకల్లా దూరం వారు, 8.45 గంటలకల్లా దగ్గర వారు పరీక్షా కేంద్రానికి బయలుదేరేలా చూసుకోవాలి. ప్రశాంతంగా పరీక్షా కేంద్రంలోకి చిరునవ్వుతో వెళ్లాలి. తోటి విద్యార్థులతో అనవసర మాటలు మాట్లాడకూడదు. ఇన్విజిలేటర్ చెప్పే సూచనలు శ్రద్ధగా గమనించాలి. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు వేయాలి. ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవి, మొదట మీకు తెలిసిన ప్రశ్నలకు జవాబులను వ్రాయండి. తప్పులు, కొట్టివేతలు లేకుండా జాగ్రత్త పడాలి. పరీక్ష రాసేటప్పుడు, ప్రశ్న నెంబరు, సెక్షన్ రాయాలి. చివరగా తెలియని ప్రశ్నలు గురించి శ్రద్ధగా ఆలోచించి రాయండి. చివరి 15 నిమిషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించాలి. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్ని పరిశీలించాకనే బయటకు రావాలి” అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.