కదిరి
కదిరి రూరల్ పరిధిలోని ఎరుకులవాండ్లపల్లి సమీపంలో ఉన్న హరీష్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ యం.యస్ కిరణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా.. 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం” అని వివరించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి పాటలకు చేసిన నృత్యాలు అలరించారు. ఇదే సందర్భంలో పలు ఆటలపోటీల్లో ప్రతిభకనబరచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ చేతులు మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.