గత ఎన్నికల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి!!ఓటర్ల తుది జాబితాతో అవకతవకలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలి!!
చంద్రగిరి:
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలని చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి జిల్లా కలెక్టర్ ‘లక్ష్మి శ’ ను కోరారు. మంగళవారం కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో జరిగిన ఘటనలను గురించి కలెక్టర్ కు వివరించామన్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో కేంద్ర పోలీస్ బలగాలను మోహరింపు చేయాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని విన్నవించారు.
తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందే ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు కారణమైన వారందరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు ఛార్జిషీట్లు వేసి దోషులను శిక్షించాలని కోరారు.
అధికార పార్టీతో కుమ్మక్కై తెలుగుదేశం నాయకుల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్న కొందరు పోలీసులపై దృష్టి పెట్టాలని కోరారు. నియోజకవర్గంలో డెత్ ఓట్లు, డబుల్ ఎంట్రీలు, జీరో డోర్ నెంబర్ ఓట్లు తొలగించలేదని అన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు జాబితాలో తొలగించలేదన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు గంపగుత్తగా తొలగించారని చెప్పారు. పోలింగ్ బూతులు ఇష్టానుసారం మార్చటంతో ఓటర్లులో అయోమయం నెలకొందన్నారు. వీటన్నింటినీ పరిశీలించి శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు పులివర్తి సుధారెడ్డి.