కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్- యం.సురేశ్ పిలుపు
వి.ఆర్.పురం
మండల పరిధిలోని చిన్నమట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, హెల్త్ డిపార్టుమెంటు వారు సికిల్ సెల్ ఎనీమియా ( రక్త హీనత) వ్యాధి నిర్ధారణ పరీక్షలు బుధవారం నిర్వహించారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం.సురేశ్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభావిత ప్రాంతాల్లో 0- 40 ఏళ్ళ మధ్య వయసున్న 7 కోట్ల మందికి అవగాహన కల్పించడం, సార్వత్రిక నిర్ధారణ పరీక్షలు కౌన్సిలింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. సికిల్ సెల ఎనీమియా వ్యాధి వారసత్వంగా వచ్చిన ఎర్ర రక్త కణాల రుగ్మతల సమూహం, రక్తంలో హీమోగ్లోబిన్ ఉత్పత్తి కి కారణమయ్యే జన్యువులు లోప భూయిష్టంగా ఉంటాయన్నారు. సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకు రక్త కణాల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ళ నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తరుచుగా వచ్చే అంటు వ్యాధులు, గర్భధారణ సమయంలో సమస్యలు లాంటి లక్షణాలతో బాధపడుతుంటారని తెలిపారు. రక్త హీనత వ్యాధి వలన భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలకు గురికావలసి వస్తుందని గుర్తు చేశారు. రక్తహీనత వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందరూ చేయించుకోవాలని, ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నామన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన అందరీ బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయులు సోడే.నాగేశ్వరరావు, సహోపాధ్యాయులు టి.విజయ కుమారి, ఆశా వర్కర్ సోడే.రాములమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

