పోరుమామిళ్ల:
పాఠశాలలకు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయు నాయకులు డిఇవో వై.రాఘవరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గురువారం కలసపాడుకు విచ్చేసిన డిఇవోను కలిసిన ఎస్టీయు నాయకులు పాఠశాలల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లించులాగున చర్యలు తీసుకోవాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల ఉపాధ్యాయులు శెలవు పెట్టుకోవడంలో చాలా ఇబ్బందులు పడుచున్న దృష్ట్యా,ఆయా పాఠశాలలకు ప్రత్యామ్నాయంగా వాలంటీర్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని, నాడు నేడు ఫేజ్-1 ద్వారా పాఠశాలలకు పలురకాల మౌళిక వసతులు సమకూరినప్పటికీ,విలీనప్రక్రియ కారణంగా పిల్లలు లేక డెస్కులు, గ్రీన్ చాక్ బోర్డులు వంటివి నిరుపయోగంగా ఉన్నందున అవసరమైన పాఠశాలలకు వాటిని బదలాయించులాగున చర్యలు తీసుకొనవలయుననియూ, నీటిశుద్ధి యంత్రాలు పాఠశాలల యందు పని చేయక నిరుపయోగంగా ఉన్నందున వాటిని రిపేరు చేయించి, వినియోగంలోనికి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టవలయుననియూ,పాఠశాలలకు సరఫరా చేయబడుచున్న మధ్యాహ్నభోజన పథకం బియ్యం సరియైన సాణ్యత లేని కారణంగా అన్నము గడ్డలు కట్టి, పిల్లలు సరిగా తినలేకున్నందున నాణ్యత గల సరియైన బియ్యం సరఫరా చేయవలయుననియూ,వంట ఏజన్సీలకు గౌరవవేతనంతోపాటు, వంట ఛార్జిలు కూడా పెంచవలయుననియూ,కలసపాడు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో అటెండర్ గా పనిచేయుచున్న వ్యక్తి చనిపోయిన కారణంగా,రెండు సంవత్సర ములనుండి కార్యాలయ పనులకు చాలా ఇబ్బందికరంగా మారిన దృష్ట్యా ఆఫీసునకు ఒక అటెండరును తాత్కాలిక ప్రాతిపదికన నియమించవలయునని కోరగా సానుకూలంగా స్పందించిన డిఇవో వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు.డిఇవోను కలిసినవారిలో రాష్ట్రకౌన్సిలర్ పి.రమణారెడ్డి,జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.శేఖర్ బాబు, మండలశాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సి.వెంకటరెడ్డి, బి.ఎన్.వి.ప్రసాద్,జిల్లా కౌన్సిలర్లు కె.శ్రీనివాసులు,కె.వి.భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.