- ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వండి
- యువతకు అధికంగా చట్టసభల సీట్లు
రాజకీయ పార్టీలు కేటాయించాలి - ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు డిమాండ్
అనంతపురము
రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య పరిష్కార కోసం పాలక ప్రతిపక్ష పార్టీలు సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలని, ఎన్నికల సందర్భంగా తప్పుడు హామీలు కాకుండా అమలు చేసేవిధంగా హామీలు ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ నందు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024 జనరల్ ఎలక్షన్లలో అన్ని రాజకీయ పార్టీలు యువతకు అధిక సీట్లు కేటాయించి యువతను ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తుండడం వల్ల పరిశ్రమలు రాకపోవడంతో దేశంలో 16 శాతం నిరుద్యోగం పెరిగిందన్నారు. దీంతో సమస్యల వలయంలో నిరుద్యోగులు చిక్కున్నారని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్న హామీని
మోదీ ప్రభుత్వం అమలు చేయలేకపోవడం, విదేశాల్లో దాగిన నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో రూ.15 లక్షలు ఇస్తామని చెప్పినా.. ఒక్క పైసా కూడా తీసుకురాలేక పోవడం సిగ్గుచేటని, తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని ఎందుకు అమలు చేయడం లేదని విమర్శించారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యూత్ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికల్లో పోటీ చేసే అన్ని రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు. ఉద్యోగ భర్తీ కోసం రెగ్యులర్ గా నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగుల వయో పరిమితి మించిపోయి నిరుద్యోగులుగా మారుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 62 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల కుదించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉద్యోగాలపై ప్రతి సంవత్సరం శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు వాటిని భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇయర్ క్యాలెండర్ పాటించాలని కోరారు. ఉద్యోగం, ఉపాధి కల్పించలేని పక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.10వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకొని.. నోటు మద్యానికి అమ్ముడుపోకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రజల్లో చైతన్యం చేసేందుకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తామని తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పరిశ్రమలు ప్రభుత్వ సంస్థల ఏర్పాటు నిరుద్యోగ యువతకు నైపుణ్యమైన శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి కోసం వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇవ్వాలని, పోటీ పరీక్షలు హాజరయ్యే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ వసతి మెటీరియల్ అందించాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ప్రత్యేక చొరవ చూపాలని లెనిన్ బాబు
కోరారు.
అనంతపురం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మెగా డీఎస్సీ అంటూ మినీ డీఎస్సీ విడుదల చేయడం సిగ్గు చేటన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు సుమారు 50,000 పైగా ఉన్నాయని పార్లమెంటులో చెప్పిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా వాటిని పరిచయం చేయకుండా కేవలం 6000 పోస్టులకు భక్తికి చేస్తావని చెప్పడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ ప్రకటన సవరించుకొని మెజార్టీ ద్వారా అన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడు సంవత్సరాలైనా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్య తీసుకుపోకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, కొన్ని ఉద్యోగాల భర్తీకి మాత్రమే చర్యలు తీసుకోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు.
ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్, నగర కార్యదర్శి మోహన్ కృష్ణ రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి ధనుంజయ ఏఐవైఎఫ్ నగర నాయకులు శ్రీకాంత్, షకీల్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

