హిందూపురం:క్రమబద్ధీకరణ విషయంలో తాజాగా అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామ సచివాలయాల ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా గత రెండు రోజుల నుండి తీవ్రమైన ఉత్కంఠకు… మనోవేదనకు గురైన ఆయా ఉద్యోగుల్లో జిల్లా అధికార యంత్రాంగం తీపి కబురు ఇచ్చింది. ఉన్నఫళంగా బదిలీలు చేస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలని కోరుకుంటూ సత్యసాయి జిల్లా సచివాల యాల ఉద్యోగులు జిల్లా కలెక్టర్… ఎస్పీలకు వినతులు పంపారు. అదేవిధంగా గ్రీవెన్స్ డే రోజు పుట్టపర్తికి పిల్లాపాపలతో వెళ్లి తమ బాధలను వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రస్తుతం వివిధ ప్రధాన పరీక్షలు జరుగుతుండడంతో తమను ఆకస్మికంగా క్రమబద్ధీకరణ పేరిట బదిలీ చేస్తే చాలా ఇబ్బందులకు గురవుతామని ఆందోళన వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన అధికార యంత్రాంగం వాయిదా వేయడంతో.. ఊపిరి పీల్చుకున్న ఆయా సచివాలయ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ బదిలీల్లో తమకు అవకాశం కల్పించాలని కోరిన సచివాలయం ఉద్యోగులు ప్రస్తుత వైకాపా ప్రభుత్వ యంత్రాంగం తమ బాధలను అర్థం చేసుకొని క్రమబద్ధీకరణ బదిలీలను వాయిదా వేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.