లేపాక్షి: ప్రపంచ పర్యాటక చిత్రపటంలో పేరొందిన లేపాక్షి వీరభద్రాలయంలో ఈనెల ఏడవ తేదీ నుండి నిర్వహించనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని హిందూపురం ప్రముఖులను వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ బ్రహ్మరథోత్సవ కరపత్రాలను అందజేసి ఆహ్వానించారు. హిందూపురం డి.ఎస్.పి కన్జక్షన్ ను ఆహ్వానించడంతోపాటు ఉత్సవాలకు బందోబస్తు ఏర్పాట్లను చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని చైర్మన్ కోరారు. హిందూపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపికా వేణు ను ఆహ్వానించి శివరాత్రి జాగారం రోజున నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు, తొమ్మిదవ తేదీన బ్రహ్మ రథోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని అందజేశారు. హిందూపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జయమ్మను కలసి శివరాత్రి పర్వదిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

అదేవిధంగా హిందూపురం మునిసిపల్ వైస్ చైర్మన్ బలరామరెడ్డిని, హిందూ పురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కన్వీనర్ కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ మాట్లాడుతూ, ఈనెల 7 నుండి 11వ తేదీ వరకు నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇదే తన ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ రావాలని కోరారు. ఈ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలు గతంలో ఎన్నడూ చేయని విధంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్మన్ ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా శివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రచారం కొనసాగుతుందన్నారు. అదేవిధంగా చిలమత్తూరు, హిందూపురం ప్రాంతాల్లో కూడా బ్రహ్మోత్సవాల ఆహ్వాన ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని, ప్రతి ఒక్కరు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందం తెలిపారు.
