కదిరి :ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గురించి ఎప్పటికప్పుడు వివిధ సామాజిక ప్రసార మాధ్యమాలలో ప్రచారం చేసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలబడతానని కదిరి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ అహ్మద్ పేర్కొన్నారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వైసీపీ సోషల్ మీడియా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాటల్లోనే “జగనన్నపై అభిమానంతో నిస్వార్ధంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కవచాల్లాంటి సోషల్ మీడియా సభ్యులకు అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన వార్తా పత్రికలు రాస్తున్న అసత్య కథనాలను తిప్పికొట్టే ప్రతి ఒక్క సైనికుడికి అండగా ఉంటాను.మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించిన సోషల్ మీడియాకు వైఎస్ఆర్ సీపీలో అధిక ప్రాధాన్యత ఉంది. కొన్ని దినపత్రికలు ప్రభుత్వంపై చేసే దుష్ప్రచారాలను ఎండగడుతూ, జగనన్న చేసే అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని కోరుతున్నాను. జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి సోషల్ మీడియా సహకారం చాలా అవసరం. కావున ఎక్కువ సంఖ్యలో సందేశాలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయాలి. వైయస్సార్సీపి రథసారథులైన మీరే జగనన్న రెండవసారి అధికారం చేపట్టడానికి కారకులవ్వాలి. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగానే కదిరి నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించే బాధ్యత నాదే. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం చురుగ్గా పాల్గొనాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సందేశాలను అధిక సంఖ్యలో పోస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రజలతో పాటు సోషల్ మీడియాపై నమ్మకంతోనే జగనన్న వైజాగ్ లో రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమాగా చెబుతున్నారు. కదిరి సోషల్ మీడియా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరుతున్నాను” అని కొనియాడారు. అనంతరం సోషల్ మీడియా సభ్యులు మక్బూల్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జిలాన్ బాషా, వైసీపీ నాయకులు పరికి సాదిక్ బాషాతో పాటు సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.