(ముత్యాల పవన్ కుమార్
అమరావతి ప్రజా భూమి ప్రతి నిధి )
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలకు సుస్తీ చేసింది. ఒకవైపున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పిహెచ్‌సి) డాక్టర్లు ఆందోళన చేస్తుండగా మరోవైపు ఎన్‌టిఆర్ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవలను ఎపి స్పెషాలిటీ ఆస్పత్రి అసోసియేషన్ (ఆషా) నిలిపివేయడంతో ప్రజలకు వైద్య ఆరోగ్య కష్టాలు అధికమవుతున్నాయి. సీజనల్ జ్వరాలు, ఇతర రోగాలు పట్టిపీడిస్తున్న సమయంలో ఇటువంటి పరిస్థితి తలెత్తడం బాధాకరం. ఆందోళనలో వున్నది వైద్యులు, సేవలు నిలిపేస్తామన్నది ఆషా అయినప్పటికీ ఈ స్థితి ఉత్పన్నం కావడానికి మాత్రం ప్రభుత్వమే కారణం. కాబట్టి పరిష్కరించే బాధ్యత కూడా ముమ్మాటికీ కూటమి సర్కారుదే! త్వరితగతిన చక్కదిద్దకపోతే రాష్ట్రం ‘అనారోగ్యాంధ్రప్రదేశ్’గా దిగజారవచ్చు. ఆరోగ్యమే మహా భాగ్యం. కాబట్టి గుంటూరు, విజయవాడ ఘటనల్లాంటి ప్రమాద ఘంటికలు మోగకముందే ప్రభుత్వాధినేత మేలుకోవడం ఎంతో అవసరం.
పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించే ఎన్‌టిఆర్ వైద్య సేవ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులకు ఏడాది నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పథకం కింద వైద్య సేవలను ఎన్‌టిఆర్ వైద్యసేవల నెట్‌వర్క్ ఆస్పత్రులు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశాయి. రూ.3000 వేల కోట్ల బిల్లుల బకాయిలు ఏడాది నుంచి పేరుకుపోయాయని, బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వడం లేదని కూడా ఆషా వాపోయింది. 2005 నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌టిఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ కింద 894 ప్రయివేటు ఆస్పత్రులున్నాయి. గతంలో వున్న వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతామనీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొస్తామనీ టిడిపి కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పింది. ఈ మేరకు ఇన్సూరెన్స్ కంపెనీల నుండి టెండర్లనూ ఆహ్వానించారు. కానీ ఇప్పుడున్న ఐదు లక్షల కవరేజికే ముప్పు ఏర్పడడం ఓ విషాదం. అయితే బకాయిలపై స్పష్టతనిచ్చి పరిష్కరించవలసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బకాయిల పాపం గత ప్రభుత్వానిదేనని తప్పించుకోవడం సబబు కాదు. అధికారంలో ఎవరున్నా అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగానే అందరూ భావిస్తారు. రాజ్యాంగం, చట్టాలు అదే చెబుతున్నాయి. కాబట్టి నెపాలు మోపడం కాకుండా ప్రజలకు వైద్య సేవలు ఆటంకం లేకుండా ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టాలి.
వైద్య విద్య పిజి కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా 15 నుంచి 20 శాతం అన్ని విభాగాల్లో ఐదేళ్లపాటు కొనసాగించాలని, కొన్ని దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పిహెచ్‌సి వైద్యులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వైద్యులవి గొంతెమ్మ కోర్కెలు కావు. గత ఇరవయ్యేళ్లుగా పదోన్నతులు లేక కొంతమంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగానే కొనసాగుతున్నారన్న వారి ఆవేదన సర్కారు పట్టించుకోవాల్సిందే! పిజి కోటా విషయం ఈ ఏడాది మాత్రమే కొనసాగిస్తామని, అనంతరం ఖాళీలను బట్టి కోటాను నిర్ణయిస్తామని చర్చల్లో అధికారులు చెప్పడం సమంజసం కాదు. గత మూడేళ్లలో పిజి వైద్యులను అవసరానికంటే అధికంగా నియమించుకున్నట్లు, ఇన్ సర్వీసు కోటా ఏళ్ల తరబడి అమలుకు సాధ్యం కాదనడం ధర్మం కాదు. 20 శాతం ఇన్ సర్వీసు కోటా ఇస్తే ప్రభుత్వ అవసరానికి మించి పిజి వైద్యులు అందుబాటులోకి వస్తారని, వీరి సేవలు వినియోగించుకోవడానికి ఖాళీ పోస్టులు లేవంటే ఎలా? అనేది వారి వాదన. ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్ర స్థానాన లేదు. మానవాభివృద్ధి సూచికల్లోనూ మనం దిగువనే ఉన్నాం. ఇంకా డోలీ మోతలు సాగుతున్న రోజుల్లో ఖాళీ వైద్య పోస్టులు లేవంటే ఎలా? ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పిపిపి విధానం తెచ్చినందుకు టిడిపి కూటమిపట్ల ప్రజలు కోపంగా ఉన్నారు. సీజనల్ వ్యాధుల పెరుగుదల నేపథ్యంలో పిహెచ్‌సి వైద్యుల ఆందోళన, ఆరోగ్యశ్రీ సేవల నిలుపుదల వంటి చర్యలతో వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వంపట్ల ప్రజాగ్రహం మరింతగా పెరగవచ్చు.

