నగరి: పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.నగరిలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆస్తుల కోసమే షర్మిల రోడ్డెక్కారంటూ సంచలన విమర్శలు చేశారు.షర్మిల నిన్న మొన్నటివరకూ తెలంగాణ బిడ్డనని చెప్పుకున్నారని, ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారంటూ రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో ఓట్లు చీల్చేందుకే షర్మిల ఎంట్రీ ఇచ్చారంటూ ఆరోపించారు. చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని సెటైర్లు వేశారు. వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చేందుకు సీఎం జగన్ వస్తే… వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డు మీదకు వచ్చారని విమర్శించారు. వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు. నిన్నటి వరకూ తెలంగాణ ఆడ బిడ్డని అని చెప్పుకుని తిరిగిన షర్మిల, అక్కడ పెట్టిన పార్టీని గాలికొదిలేశారని విమర్శించారు. ఇప్పుడు మరో కొత్త అవతారంతో షర్మిల ఏపీకి వచ్చారన్నారు. కేవలం వైసీపీ ఓట్లు చీల్చడానికే షర్మిల ఏపీకి వచ్చారంటూ మంత్రి రోజా ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ లో చేరిన షర్మిల… సీఎం జగన్ పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు వదిలిన బాణం షర్మిల…టీడీపీకి మేలు చేయడానికే ఏపీకి వచ్చారని మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబుకు మేలు చేసేందుకు వైఎస్ పేరు షర్మిల వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినా కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల.. సీఎం జగన్ పై, తనపై విషం చిమ్ముతున్నారన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ ఆత్మక్షోభించేలా చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్‌కు, ఆయన ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ మాత్రమే అని మంత్రి రోజా స్పష్టం చేశారు.”మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి… నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నేను చచ్చిపోయేంత వరకు తెలంగాణ ప్రజలకు సర్వీస్ చేస్తానని షర్మిల చెప్పింది. ఇప్పుడు ఆ పార్టీని గాలికి వదిలేసి, వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేసి మనపై విషం చిమ్ముతుంది. నిజమైన రాజన్న బిడ్డ జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు వదిలిన బాణంలాగా షర్మిల పనిచేస్తుంది. వైఎస్ పేరు నిలబెట్టేలా షర్మిల ఏం చేయలేదు.”అని మంత్రి రోజా అన్నారు.