తెలంగాణ గవర్నర్ తమిళిసై హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.తొలుత గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్..సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.మహోన్నతమైన మన రాజ్యాంగాన్ని రాజ్యాంగకర్తలు ఎంతో ముందు చూపుతో తయారు చేశారన్నారు.
విధ్వంసానికి గురైన వ్యవస్థలను పునర్నిర్మించుకుందామని.. రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలిస్తేనే పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందుతాయని.. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని… అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోందని.. ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం అని గవర్నర్ తమిళసై అన్నారు.
‘‘బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రాజ్యంగం మార్గదర్శకత్వంలో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయమని.. ఆ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు ముందుకెళ్తే ప్రజలు ఊరుకోరన్నారు. నియంతృత్వం ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదని. .రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే రాష్ట్రం సాధించుకున్నామని. .ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లవని ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని.. మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని.. మిగతా గ్యారంటీలనూ అమలు చేస్తామని..గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుకుంటూ .. అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెడతాం.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. దీనిపై ఎలాంటి అపోహలకూ యువత లోనుకావొద్దు’’ సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన ఉంటుందని గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.