రూ.10 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ని ప్రారంభించిన కలెక్టర్.
బుట్టాయగూడెం.
విద్యార్థుల స్వీయ అధ్యయనం, విషయ సేకరణలో డిజిటల్ లైబ్రరీలు కీలకపాత్ర పోషించే విధంగా వాటిని అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ అన్నారు. మండలంలోని బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలను జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ బుధవారం సందర్శించారు. తొలుత గిరిజన గురుకుల ఉన్నత పాఠశాలలో సిఎస్ఆర్ నిధులు రూ. 10 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని ఆయన ప్రారంభించారు. డిజిటల్ లైబ్రరీ ప్రారంభించిన అనంతరం లైబ్రరీ లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, పుస్తకాలను పరిశీలించారు. విద్యార్ధులు డిజిటల్ లైబ్రరీకి వచ్చి పుస్తక పఠనం చేసేలాగా ఉపాధ్యాయులు కొంత భాధ్యత తీసుకోవాలన్నారు. పాఠశాల ఆవరణలో క్రీడా మైదానం మెరుగుపరచడానికి, డైనింగ్ హాల్ ఏర్పాటుకు ఖాళీగా ఉన్న మూడు రూమ్ లను కలిపి డైనింగ్ హాలుగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ డిడి పి.వి.శ్రీనివాసనాయుడిని ఆదేశించారు. అదే విధంగా లైబ్రరీ మెయింట్ నెన్స్ కు మంజూరు చేసిన నగదును లైబ్రరీకి సంబంధించిన క్రొత్త పుస్తకాలు కొనుగోలుకు ఉపయోగించి, ఆ ఖర్చులను రిజిష్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు.
లైబ్రరీలో ఉన్న వైట్ బోర్డుకు బ్లాక్ రంగు వేయించి మంచి స్లోగన్స్ ను ప్రతిరోజు డిస్ ప్లే చేయాలన్నారు.

అనంతరం గిరిజన బాలికల గురుకుల పాఠశాల భోజనశాలలో వండిన ఆహార పదార్ధాలను కలెక్టర్ పరిశీలించి నాణ్యతతో ఉండాలని, అదే విధంగా త్రాగునీరు స్వచ్ఛంగా ఉండేలాగా ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్ పర్యవేక్షిచాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి ఇక్కడ పిల్లలు ఆటలు ఆడుతున్నారా అని ఆరా తీయగా,ఖో ఖో, కబడ్డీ తో పాటు వాలీ బాల్ అడుతున్నట్ల్లు టీచర్లు తెలిపారు.గ్రౌండ్ అభివృద్ధి చేసే విషయంపై సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ వారికి పలు సూచనలు చేశారు.
ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజనీబాయ్, ప్రధానోపాధ్యాయురాలు ఎస్. విజయలక్ష్మి, సర్పంచ్ యం. రామలక్ష్మీ, యంపిడివో ప్రవీణ్, తహశీల్దారు వెంకటేశ్వర్లు, మండల విద్యాశాఖ అధికారి తెల్లం బాబూరావు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.