చంద్రబాబుపై 3 లక్షల మెజారిటీతో గెలుస్తా: కేశినేని నాని
నందిగామ వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో కేశినేని నాని
చంద్రబాబు విజయవాడ నుంచి పోటీ చేసినా గెలవరు
విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విజయవాడలో తనను ఓడించడం ఎవరితరం కాదని … చివరకు టిడిపి అధినేత చంద్రబాబే తనపై పోటీచేసినా గెలవలేరని కేశినేని నాని అన్నారు. ఈసారి గెలవడం కాదు భారీ మెజారిటీ సాధిస్తానని … చంద్రబాబు పోటీచేసినా 3 లక్షల మెజారిటీ ఖాయమన్నారు. విజయవాడ లోక్ సభలో నన్ను ఓడించే నాయకుడెవరూ టిడిపిలో లేరని కేశినేని నాని అన్నారు.
టిడిపి పార్టీ ఇచ్చిన అన్ని వనరులను వినియోగించుకున్నా మంగళగిరిలో లోకేష్ ఓటమిపాలయ్యాడు… కానీ పార్టీ నుండి ఎలాంటిది ఆశించకుండానే తాను రెండు దఫాలు విజయవాడ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించానని కేశినేని నాని చెప్పారు. అందువల్లే ఎమ్మెల్యేగా తనను తాను గెలిపించుకోలేకపోయిన ఆఫ్ట్రాల్ నాయకుడు లోకేష్ చేసే పాదయాత్రలో పాల్గొనలేదని అన్నారు.
రాజకీయంగా తనది డిల్లీ స్థాయి అని … అలాంటి తనపై విమర్శలు చేసే స్థాయి కూడా లోకేష్ కు లేదని నాని అన్నారు. ఈసారి కూడా వైసిపి చేతిలో లోకేష్ ఓడిపోవడం ఖాయమని ..ఇప్పటివరకు అసలు గెలుపన్నదే ఎరగని లోకేష్ స్థాయి ఎంత అంటూ మండిపడ్డారు.