చుక్కల సమస్యలు పరిష్కరించాలంటూ తహసిల్దార్ కార్యాలయంకు తాళం దశాబ్ద కాలంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించిన తీరనిసమస్య
ముదిగుబ్బ:జిల్లాలోనే విస్తీర్ణంలో పెద్దమండలమైన ముదిగుబ్బ మండలంలో రైతులకు వివిధ వర్గాల ప్రజలకు చుక్కల భూములు చుక్కలు చూపిస్తున్నాయని మండల వాసులు పేర్కొంటున్నారు. విద్యార్థుల ఉన్నత చదువులకనో, చదువుకున్న కుమారుడికి ఉద్యోగంరాక వ్యాపారంలో పెట్టుబడికనో, ఆడబిడ్డ వివాహానికనో, అనారోగ్య పాలైన తల్లిదండ్రుల వైద్య ఖర్చులకనో రకరకాల కారణాలతో పలుకుటుంబాలు ఉన్న సొంతభూమిని అమ్మి సమస్యలనుండి గట్టెక్కాలని ఆలోచించిన వారికి ముదిగుబ్బ మండలంలోని భూములు చుక్కల సమస్యలతో రిజిస్ట్రేషన్లు కాక తల్లడిల్లి పోతున్నారు. ఇదేసమస్యపై బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో ముదిగుబ్బ తహసిల్దార్ కార్యాలయానికి తాళంవేసి నిరసన తెలపడం జరిగింది. అంతకుముందు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, జిల్లాకార్యవర్గ సభ్యులు బిల్లుకుల్లాయప్ప, మండల కార్యదర్శి చల్లం శ్రీనివాసులు, సిపిఐ కార్యకర్తలు, రైతులతో కలిసి అంబేద్కర్ సర్కిల్ నుండి ర్యాలీగావస్తూ చుక్కలభూముల సమస్యకు పరిష్కారం చూపాలని, రిజిస్ట్రేషన్లు జరిగేలా ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వాలని నినాదాలు చేసుకుంటూ తహసిల్దార్ కార్యాలయంకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసిల్దార్ సరస్వతిదేవికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మండల వ్యాప్తంగా సుమారు 15వేల ఎకరాల భూములకు చెందిన రైతులు, వ్యాపారులు, రియల్టర్లు ఈసమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. వీటికి ఎన్వోసీ కోరుతూ పదేపదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులుగానీ, ప్రభుత్వంగానీ సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇప్పటికైనా చుక్కల భూములు రిజిస్ట్రేషన్లు జరిగేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వంశపారంపర్యంగా సాగుచేసుకుంటూ వస్తూ పాసుపుస్తకాలు మాత్రమే కలిగిఉన్న పాతపట్టా భూములు చుక్కల్లోనూ, 22ఏ లోను, నిషేధిత భూముల్లోనూ నమోదు కాబడ్డాయని వాటిని రైతుల విజ్ఞప్తుల మేరకు పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఈఉద్యమాన్ని తీవ్రంచేసి జిల్లాస్థాయిలో పెద్దఎత్తున చేపట్టేలా శ్రీకారం చుడతామని హెచ్చరించారు.