హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన గురువారం జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావులు హాజరయ్యారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 9న గవర్నర్ ప్రసంగంపై చర్చ, 10న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 12, 13 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. అంతకుముందు బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ తరపున మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొనేందుకు వెళ్లారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ నుంచి లెటర్ ఇవ్వకుండా అనుమతి ఇచ్చేది లేదని మంత్రి స్పష్టం చేశారు. దీంతో హరీశ్ రావు సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ అనుమతితోనే తాను బీఏసీ సమావేశానికి వెళ్లానని తెలిపారు. అయినప్పటికీ బీఏసీ సమావేశంలో పాల్గొనకుండా అధికార పార్టీ సభ్యులు అడ్డుకున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.