హిందూపురం టౌన్ :హిందూపురం రూరల్ మండల పరిధిలోని పూలకుంట ఉన్నత పాఠశాలలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆదేశాల మేరకు ఆదివారం స్కౌట్స్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అత్యున్నత పురస్కారం రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీనివాసరావు పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ టెస్టింగ్ క్యాంపు ఈ నెల 4వ తేదీ వరకు జరుగుతుందని, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్ చేత ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారని అన్నారు. సమాజ సేవే లక్ష్యంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. సదా సమాజ సేవలో ఉంటాం అనేది స్కౌట్స్ యొక్క నినాదమని చెప్పారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి 80 మంది స్కౌట్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కేశవమూర్తి, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపాధ్యాయులు వెంకటరమణప్ప, గిరిధర్, బొమ్మయ్య, రాష్ట్ర పరిశీలకులు నాగరాజు గుప్తా, డీఓసీలు నాగరాజు, లక్ష్మన్న, వివిధ పాఠశాలల స్కౌట్ మాస్టర్లు పాల్గొన్నారు.

