హిందూపురం టౌన్
రక్తహీనత, నులిపురుగుల నివారణ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని లక్ష్మీపురం వైద్యాదికారిణి మంజుశ్రీ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని శుక్రవారం పట్టణం, రూరల్ మండల వ్యాప్తంగా వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పెద్ద ఎత్తున నిర్వహించారు. లక్ష్మీపురం ఉప ఆరోగ్య కేంద్ర పరిధిలోని అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ, నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించటం, నీరసం, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఆల్బెండజోల్ మాత్ర వేయడం ద్వారా రక్త హీనత నివారణ, పోషకాలు గ్రహించడం జరుగుతుందని, తద్వారా ఏకాగ్రత పెరుగుతుందన్నారు. 1 నుండి 5 సంవత్సరాల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల లోనూ, 6 నుండి 19 సంవత్సరాల విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలలో పంపిణీ చేయడం జరుగుతుందని, 1 నుండి 2 సంవత్సరాల చిన్నారులకు అర మాత్ర”గుండగా చేసి వేయించడం జరుగుతుందని, 2 నుండి 19 సంవత్సరాల విద్యార్థులకు ఒక మాత్ర బాగా నమిలి మింగించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బందితో పాటు సిఓ ముస్తఫా, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పద్మలీల, లక్ష్మీదేవి, అలివేలు, హసీనా తదితరులు పాల్గొన్నారు.