హిందూపురం టౌన్ :దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అదనపు జిల్లా జడ్జి కం పల్లె శైలజ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో మత్తు పదార్థాల నిషేధం పై జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలు కావడం వల్ల అటు ఆరోగ్యంతో పాటు ఇటు ఆర్థికంగా కూడా స్థితికి పోయే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న యువ సంపద ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదన్నారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి లక్ష్యాలను సాధించేందుకు, సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. చదువులో రాణిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైందని మంచి అలవాట్లను అలవర్చుకొని మంచి స్నేహితులతో సాంగత్యం చేయడం వల్ల సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. యువత ఆకర్షణలకు లోను కాకుండా వాస్తవ జీవితాలను గ్రహించాలన్నారు. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. మత్తు పదార్థాలు కు బానిసలయితే కుటుంబాల గౌరవం కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యాన్ని సంరక్షించుకొంటూ సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి కళాశాలల ప్రిన్సిపాళ్ళు నారాయణరెడ్డి, శివ శంకర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాసరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్, న్యాయవాదులు సుదర్శన్, సంతోషికుమారి తదితరులు పాల్గొన్నారు.

