- అధికరేట్లకు విద్యుత్ కొనుగోళ్ళ వెనుక చంద్రబాబు అవినీతి
- ఆనాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2.40కి కొంటే గగ్గోలు పెట్టారు
- నేడు కూటమి సర్కార్ యూనిట్ రూ.4.60 కి ఎలా కొనుగోలు చేస్తోందో చెప్పాలి
: నిలదీసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం:
కూటమి ప్రభుత్వం యాక్సిస్ సంస్థతో తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రూ.11వేల కోట్ల స్కామ్ దాగి ఉందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నగరపార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వెనుక సీఎం చంద్రబాబు అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2.60కి కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఈరోజు యూనిట్ రూ.4.60కి ఎలా కొనుగోలు చేస్తున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే…
కూటమి పాలనలో ఎన్నికల హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాష్ట్రంలో పేదలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేశారు. ఈ పదకొండు నెలల కాలంగా గత వైయస్ఆర్‌సీపీ పాలనపై బుదరచల్లడానికే ప్రభుత్వం పరిమితం అయ్యింది. తమ పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుకుంటోంది. నాలుగైదు నెలల కిందట కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వైయస్ జగన్ హయాంలో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు సంబంధించి అనేక ఆరోపణలు చేసింది. కేంద్రప్రభుత్వ సంస్థ సెకీతో జరిగిన ఒప్పందాల ద్వారా యూనిట్ రూ.2.40కి కొనుగోలు చేయడాన్ని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టింది. సోలార్ పవర్‌కు సంబంధించి మేం చేసిన ఒప్పందాన్ని ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున విమర్శించారు. దాదాపు పదిహేను రోజుల పాటు ఎల్లో మీడియా నిత్యం వైయస్ జగన్‌పై బుదరచల్లుతూ పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో పుంఖానుపుంఖాలుగా కథనాలను ప్రచురించారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అవినీతి వ్యవహారంగా చేసుకున్న చంద్రబాబు ఒప్పందాలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోనూ, సీఎం అయిన తరువాత కూడా సెకీ తో వైయస్ఆర్‌సీపీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరుగిపోయిందని పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేశారు. 2021-22 లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం దేశంలోని ఇతర రాష్ట్రాలతో సెకీ చేసుకున్న దానికన్నా చాలా తక్కువకే కుదుర్చుకుంది.
- యాక్సిస్‌తో ఒప్పందాల్లో అవినీతి మతలబు
కూటమి ప్రభుత్వం కొత్తగా రూ.11వేల కోట్ల భారీ స్కామ్‌కు తెరతీసింది. యాక్సిస్ అనే సంస్థతో యూనిట్ రూ.4.60 లకు నాలుగువందల మెగావాట్లను 25 సంవత్సరాల వరకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంది. మేం ఆనాడు చేసుకున్న ఒప్పందం కన్నా దాదాపు రెట్టింపు రేటుకు ఏరకంగా యాక్సిస్‌తో ఒప్పందం చేసుకున్నారు? తద్వారా రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.210 కోట్లు అదనపు భారాన్ని మోపుతున్నారు. దీనిలో చంద్రబాబు వాటా ఎంత? యూనిట్ రూ.2.11 ల ఎక్కువకు ఎందుకు కొనుగోళ్ళు చేస్తున్నారు? గతంలో వైయస్ జగన్‌పై చేసిన ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు? 2014-19 మధ్యలో చంద్రబాబు ఇలాగే దాదాపుగా రూ.6.90 యూనిట్ చొప్పున ఒప్పందాలు చేసుకున్నారు. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ ఒప్పందాలు చేసుకున్నారు. దీని వల్ల జరిగే అదనపు భారం రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఇరవై అయిదు ఏళ్ళ పాటు ఈ రేట్లు భరించాలి. యూనిట్ 2.11 రూపాయలు తేడాతో ఒప్పందాలు చేసుకుంటారు. ఈ ఒప్పందాలపై ఏపీఈఆర్‌సీకి పంపి, చర్చించి, వారి అంగీకారంతోనే విద్యుత్ కొనుగోళ్ళు చేయాల్సి ఉంది. కానీ చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని సెక్షన్ 108ని చూపి ఈ ఒప్పందాలు చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాలు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తే, గత ప్రభుత్వంలో చేసిన ఒప్పందాలపై అబద్దాలు మాట్లాడి బుకాయింపులకు దిగుతున్నారు.
- ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు?
ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.15 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. దీనిపై వైయస్ఆర్‌సీపీ ప్రజలతో కలిసి ఆందోళనలు నిర్వహించింది. ఒకవైపు ప్రజల కోసం వైయస్ఆర్‌సీపీ పనిచేస్తుంటే, మరోవైపు తమ బినామీలకు లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అధికరేట్లకు విద్యుత్ ఒప్పందాలు, కారుచౌకగా ఖరీదైన భూములను కేటాయించడం ఇలా ప్రతిదానిలో చంద్రబాబు ధనదాహం కనిపిస్తోంది. రాష్ట్రంలో పేదలు, వారి సంక్షేమంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదు. సింహాచలంలో ప్రభుత్వ అవినీతి వల్ల ఏడుగురు భక్తుల ప్రాణాలు ఫణంగా పెట్టాయి. గోడ నిలబడదని చెప్పినా, బెదిరించి పనులు చేయించారని కాంట్రాక్టర్ చెబుతున్నారంటే అవినీతి ఎంతగా తాండవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు శాండ్, మరోవైపు ల్యాండ్, ఇంకోవైపు వైన్, బెల్డ్ షాప్‌లు ఇలా అవినీతికి ఎన్ని అవకాశాలు ఉంటే, అన్ని అవకాశాలను కూటమి నేతలు వాడుకుంటున్నారు. పైస్థాయిలో చంద్రబాబు నుంచి కిందిస్థాయిలోని కూటమి కార్యకర్తల వరకు దీనినే అనుసరిస్తున్నారు. నిత్యం అవినీతి తప్ప మరోకటి లేదనే విధంగా కూటమి పాలనసాగుతోంది.
- జగన్‌పై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి
వైయస్ జగన్‌పై ఆనాడు సెకీ విషయంలో చంద్రబాబు, కూటమి పార్టీలు చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు చేసుకున్న యాక్సిస్ ఒప్పందాలపై ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. ప్రజలపై ఎంత భారం పడుతోంది, దానిలో చంద్రబాబు కాజేసేది ఎంతో ప్రజల ముందు పెడతాం. మా టైంలో ఐఎస్‌టీఎస్ చార్జీలు లేవని చెప్పినా, ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేశారు. గతంలో వైయస్ఆర్‌సీపీపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆరోపణలు చేశారు. ఎల్లో మీడియా ద్వారా పెద్ద ఎత్తున బురదచల్లారు. అవినీతి అంటూ చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా రుజువు చేశారా? అమరావతి ఒక స్కామ్, విద్యుత్ ఒప్పందాలు, విశాఖపట్నంలో లులూ, ఉర్సా భూకేటాయింపులు అన్నీ అవినీతి బాగోతాలే. ఈ అవినీతి వ్యవహారాలు వెనక్కి తీసుకునే వరకు ప్రజల పక్షాల పోరాడతాం.